Andhra Pradesh: దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్తే..
దొంగలు రూటు మార్చారు.. ఇళ్లలో చొరబడి బంగారం, నగదు దోచేసే పాత పద్ధతులకు స్వస్తి పలికి.. సీజన్‌కు తగ్గట్టు సరికొత్త స్కెచ్ వేశారు. దసరా పండుగ వేళ మార్కెట్‌లో మటన్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పశువుల పాకపై పడ్డారు. మందలో నుంచి బాగా బలిసిన మేకలు, గొర్రెలను ఏరికోరి మరీ ఎత్తుకెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ వింత చోరీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సాధారణంగా దొంగలు ఇళ్లు, ఆలయాలు, దుకాణాలను టార్గెట్ చేసి బంగారం, నగదు దోచుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేటుగాళ్లు పంథా మార్చారు. సీజన్‌కు తగ్గట్లుగా పక్కా ప్లాన్‌తో సరికొత్త దొంగతనాలకు తెరలేపుతున్నారు. దసరా పండుగ వేళ మార్కెట్‌లో మటన్‌కు ఉండే విపరీతమైన డిమాండ్‌ను పసిగట్టిన దుండగులు.. పశువుల పాకలపై కన్నేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలాజీపురంలో ఏకంగా 37 మేకలు, గొర్రెలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలాజీపురం గ్రామానికి చెందిన తలగాన బాలరాజు అనే రైతు పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన గొర్రెలు, మేకలను గ్రామ సమీపంలోని పశువుల శాలలో ఉంచాడు. అయితే బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు పశువుల పాకలోకి చొరబడ్డారు. దసరా పండుగ సమయం కావడంతో మందలోని బాగా బలిసిన, పెద్ద సైజు గొర్రెలు, మేకలను మాత్రమే ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని మరీ వాహనంలో ఎత్తుకెళ్లారు.
లక్షల్లో నష్టం.. లబోదిబోమంటున్న రైతు కుటుంబం
ఉదయం పశువుల శాలకు వెళ్లి చూసిన బాలరాజుకు అక్కడ గొర్రెలు, మేకలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె గుభేలుమంది. మొత్తం 37 గొర్రెలు, మేకలు మాయమైనట్లు గుర్తించాడు. మార్కెట్‌లో ఒక్కో మేక, గొర్రె ధర రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతుందని, దొంగతనానికి గురైన జీవాల విలువ సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల పైమాటే ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఏళ్ల తరబడి పడ్డ కష్టమంతా ఒక్క రాత్రిలోనే దొంగలపాలైందని బాలరాజు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పండుగ వేళ భారీ లాభాలు గడించవచ్చన్న దురాశతోనే దొంగలు ఇంత పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు, వాహనాల రాకపోకలపై నిఘా ఉంచి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
