కరోనా సోకిందన్న అనుమానంతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన వ్యక్తి

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

కరోనా సోకిందన్న అనుమానంతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన వ్యక్తి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2020 | 12:42 PM

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్‌ బెంగాల్‌కి చెందిన పల్టుపాన్‌ (34) కొద్ది సంవత్సరాల క్రితం భార్యతో సహా నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డారు. గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్న అతడు 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకున్నాడు. అయినా తగ్గక పోవడంతో.. వైద్యుల సూచన మేరకు మలక్‌పేట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు.

రెండు రోజుల పాటు ఆసుపత్రి చుట్టూ తిరిగినా బెడ్లు లేవని అతడిని చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని చెప్పినా వారు చేర్చుకోలేదు. ఇక శుక్రవారం శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది కావడంతో.. భయాందోళనకు గురైన పల్టుపాన్‌ తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్‌ చేసి హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకెళ్లాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాత్రి 7.55 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌కి చేరుకున్నారు. ఆ తరువాత శ్రీరాములును అక్కడే ఉంచి, పల్టు పాన్‌ ముందుకు వెళ్లి హుస్సేన్‌ సాగర్‌లో దూకాడు. దీన్ని గమనించిన శ్రీరాములు రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, అతడి ఆచూకీ లభించలేదు.