Pro Kabaddi League: కూతకు వేళాయె.. హైదరాబాద్‌ వేదికగా ప్రో కబడ్డీ యుద్ధం

PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌) 11వ సీజన్‌కు రంగం సిద్ధమయ్యింది. హైదరాబాద్ వేదికగా శుక్రవారంనాటి తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ , బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Pro Kabaddi League: కూతకు వేళాయె.. హైదరాబాద్‌ వేదికగా ప్రో కబడ్డీ యుద్ధం
Pro Kabaddi League Season 11
Follow us

|

Updated on: Oct 17, 2024 | 6:03 PM

హైదరాబాద్, 17 అక్టోబర్ 2024: గత పదేళ్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌) చరిత్రాత్మక రెండో దశాబ్దంలోకి అడుగు పెడుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా లీగ్ పదకొండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో తెలుగు టైటాన్స్ , బెంగళూరు బుల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగే ఉత్కంఠ భరితమైన తొలి పోరుతో కొత్త సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో కొత్త సీజన్‌ ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మషాల్ స్పోర్ట్స్‌– పీకేఎల్‌ లీగ్ కమిషనర్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ లీగ్‌ అనుపమ్ గోస్వామి, తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్ల కెప్టెన్లు పవన్ సెహ్రావత్, పర్దీప్ నర్వాల్ తో కలిసి పాల్గొన్నారు. మిగిలిన 10 జట్ల కెప్టెన్లు కూడా పీకేఎల్ ట్రోఫీ ఆవిష్కరణకు హాజరయ్యారు.

మెటాతో అనుబంధంలో భాగంగా పీకేఎల్‌ జట్ల కెప్టెన్లు, ప్రముఖ ఆర్జేలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల బృందంతో నిర్వహించిన మ్యాచ్‌ ఆకట్టుకుంది. బిగ్ నెర్డ్స్, హార్దిక్ బంగా, సిధాంత్ సర్ఫేర్, ఆశిష్ సింగ్ తదితర ఆర్జేలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ మ్యాచ్‌కు హాజరై ప్రొ కబడ్డీ స్టార్లతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడి ఈ ఆటకు ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.

గత సీజన్‌ ప్రయాణం, రాబోయే సీజన్ గురించి ప్రో కబడ్డీ లీగ్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తన ఆలోచనలను పంచుకున్నారు. ‘పీకేఎల్‌ తొలి దశాబ్దాన్ని పూర్తి చేసుకోవడం అనేది ఒక భారీ విజయం. కానీ, ఇది మాకు గత అనుభవాలను ఉపయోగించుకొని తదుపరి దశ కోసం లీగ్‌ను సిద్ధం చేయడానికి, మరిన్ని విజయ గాథలను రూపొందించడానికి మార్గం చూపుతోంది. ఈ లీగ్‌ ద్వారా కొన్నేళ్లుగా ఆటగాళ్లకు ఎంతో మద్దతు లభించింది. ఆటగాళ్ళంతా ఇప్పుడు తాము కబడ్డీ అథ్లెట్లమని చెప్పుకునే విశ్వాసం కలిగించడం అందులో ఒక గొప్ప విషయం. గత పదేళ్లలో ప్రపంచ స్థాయి భారతీయ క్రీడను పునరుజ్జీవం అందించడంలో సహాయం చేసిన తర్వాత ఈ గొప్ప ప్రయాణాన్ని తదుపరి కొత్త తీరాలకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. పీకేఎల్‌పై అంతర్జాతీయంగా కూడా గణనీయమైన ఆసక్తి నెలకొంది. మేము ఎల్లప్పుడూ అభిమానులే మొదటి ప్రాథాన్యత అనే ఆలోచనా విధానంతో పని చేస్తున్నాం. దీన్ని కొనసాగించేందుకు నిరంతరం శ్రమిస్తామని హామీ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.

సీజన్‌ ప్రారంభ మ్యాచ్ కోసం ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నానని తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలిపాడు. ‘మా సొంత అభిమానుల ముందు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఆడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు ఎల్లప్పుడూ మాకు చాలా మద్దతు ఇస్తారు. మేం మ్యాట్‌పైకి వస్తున్నప్పుడు వారి నుంచి మరింత మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం. జట్టు మంచి స్థితిలో ఉంది. ఈ సీజన్‌లో మేం బాగా రాణిస్తామన్న నమ్మకం ఉంది’ అని సెహ్రావత్ నమ్మకం వ్యక్తం చేశాడు.

Pkl 2024

Pkl 2024

పీకేఎల్‌లో తాను అరంగేట్రం చేసిన బెంగళూరు బుల్స్ జట్టులోకి తిరిగి వస్తున్న కెప్టెన్ కెప్టెన్ పర్దీప్ నర్వాల్ తన ముందున్న సవాల్‌కు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా పర్దీప్‌ మాట్లాడుతూ ‘పీకేఎల్‌11వ సీజన్‌ పోటాపోటీగా ఉండనుంది. మేమంతా బరిలోకి దిగేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ సీజన్‌ కోసం మేం మెరుగ్గా సన్నద్ధమయ్యాం. మా జట్టు చాలా సమతుల్యంగా ఉంది. లీగ్‌ను మెరుగ్గా ప్రారంభించడానికి బుల్స్‌ గ్యాంగ్‌ ఆసక్తిగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ముంబైలో జరిగిన వేలంలో ఎనిమిది మంది ఆటగాళ్లు కోటి రూపాయాలకు పైగా అమ్ముడవడంతో పీకేఎల్‌11 సన్నాహాలు చారిత్రాత్మక రీతిలో ప్రారంభమయ్యాయి. పవన్, పర్దీప్ నేతృత్వంలోని తెలుగు టైటాన్స్‌, బెంగళూరు శుక్రవారం తొలి మ్యాచ్‌ లో తలపడతాయి. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్‌లో రూ. 1.015 కోట్లతో పీకేఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ డిఫెండర్ -అయిన సునీల్‌ కుమార్ నేతృత్వంలోని యు ముంబా, లీగ్‌లో స్టార్‌‌ రైడర్లలో ఒకడైన నవీన్ కుమార్‌తో కూడిన దబాంగ్ ఢిల్లీ కేసీతో పోటీ పడనుంది.

ఈసారి పీకేఎల్‌ మూడు -నగరాల ఫార్మాట్‌కు తిరిగి వచ్చింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు తొలి అంచె పోటీలు జరుగుతాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రెండో దశకు నోయిడా ఇండోర్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 24 వరకు పుణెలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని బ్యాడ్మింటన్ హాల్‌ మూడో అంచె జరుగుతుంది.

పీకేఎల్‌ 11 సీజన్ అడుగు పెడుతుండగా అభిమానులను డిజిటల్‌గా, ఆన్‌లైన్‌లో ప్రథమ స్థానంలో ఉంచాలనే మా నిబద్ధత గతంలో కంటే బలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో మా సూపర్‌ఫ్యాన్‌లకు జీవితంలో ఒక్కసారైన అనుభవాలను అందించడానికి మేము ఆతృతగా ఉన్నాం. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో నిర్మించాలని ప్రణాళిక రచిస్తున్నాం. డిజిటల్ ఇంటర్‌‌వెన్షన్స్‌, గుర్తుండిపోయే ఇన్-స్టేడియా మూమెంట్స్‌ తో మరింత చిరస్మరణీయమైన కనెక్షన్‌లను సృష్టించడంతో పాటు పీకేఎల్ ప్రయాణంలో మా అభిమానులను అంతర్భాగంగా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము.

ప్రొ కబడ్డీ లీగ్‌లోని అన్ని అప్‌డేట్‌ల కోసం www.prokabaddi.com వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని నిర్వాహకులు సూచించారు. అలాగే అధికారిక ప్రొ కబడ్డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే, Instagram, YouTube, Facebook, Xలో @prokabaddiని ఫాలో అవుతూ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ప్రొ కబడ్డీ లీగ్ 11 సీజన్ అక్టోబర్ 18 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమ్ అవుతుంది.