Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!
1896 నుంచి 2016 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 15,683 పతకాలలో భారతదేశం కేవలం 28 మాత్రమే గెలుచుకుంది. మరో రెండు దేశాలతో కలిసి 53వ స్థానంలో కొనసాగుతోంది.
Olympic Games: 1896 నుంచి 2016 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలలో మొత్తం 15,683 పతకాలలో భారతదేశం 28 పతకాలు సాధించింది. మరో రెండు దేశాలతో కలిసి 53వ స్థానంలో కొనసాగుతోంది. ఒలింపిక్ క్రీడల్లో గెలిచిన విజేతకు బంగారు పతకం, రన్నర్ గా నిలిచిన వారికి రజత పతకం, అలాగే మూడో స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం అందిస్తారని మనందరికీ తెలిసిందే. 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలయ్యాయి. పతకాలు ఇవ్వడం కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభమైంది. కానీ, తొలిసారి జరిగిన ఒలింపిక్స్ లో విజేతలకు బంగారు పతకాలను ఇవ్వలేదు. బంగారు పతకాలకు బదులు రజత పతకంతోపాటు ఆలివ్ కొమ్మల దండను బహుమతిగా ఇచ్చేవారు. అలాగే రన్నర్లకు కాంస్య లేదా రాగి పతకాలతోపాటు లారెల్ దండలను అందించేవారు. అనంతరం 1900వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో చాలామంది విజేతలకు పతకాలకు బదులు కప్పులు, ట్రోపీలను అందించారు.
ఇక 1904వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్‌లోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఒలింపిక్స్ నుంచి బంగారు, వెండి, కాంస్య పతకాలను అందించడం ప్రారంభించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఈ పతకాలను ఇచ్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఏడాదే నిర్ణయించింది. కాగా, 1896, 1900 ఒలింపిక్స్ లో ఉత్తమంగా నిలిచిన వారికి కూడా మరలా బంగారు, రజతం, కాంస్య పతకాలు అందించారు.
మొదటి మూడు స్థానాల్లో దైనికైనా టై ఏర్పడితే.. ఐఓసీ నిబంధనల మేరకు మిగతా వారికి కూడా పతకం పొందే అర్హత లభిస్తుంది. ఇదే రూల్‌ను మరికొన్ని క్రీడలు.. బాక్సింగ్, జూడో, టైక్వాండ్, కుస్తీ వంటి పోటీల్లో కూడా పాటించడం మనకు తెలిసిందే. ఇలాంటి టై అయిన సందర్భంలో కాంస్య పతకాన్ని వారికి అందిస్తారు. ఫలితంగా మిగతా పతకాల కంటే కాంస్య పతకాలు ఎక్కువగా లభిస్తాయన్నమాట.
కాగా, 1896 ఏథెన్స్ నుంచి 2016 రియో ఒలింపిక్ క్రీడల వరకు సమ్మర్ గేమ్స్‌లో మొత్తం 15,683 పతకాలు వివిధ దేశాలు సాధించాయి. ఇందులో 5,116 బంగారం, 5,080 రజతం, 5,487 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు ఇంత పెద్ద మొత్లంలో ఉన్నా.. ఒలింపిక్స్‌లో మనదేశం ఇప్పటివరకు కేవలం 28 పతకాలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో 9 బంగారు, 7 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తం పతకాలలో భారత అథ్లెట్స్ గెలుపొందిన పతకాలు కేవలం 0.17 శాతం మాత్రమే. యూఎస్‌ఏ మొత్తం 2,523 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనా 546 పతకాలను సాధించి ఐదో స్థానంలో నిలిచింది.
ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు గెలిచిన 28 పతకాలలో.. 11 పతకాలు హాకీ నుంచి గెలుపొందగా, కుస్తీ నుంచి 5, షూటింగ్ నుంచి 4, బ్యాడ్మింటన్‌లో 2, స్వాతంత్య్రానికి పూర్వం నార్మన్ ప్రిట్ చార్డ్ అనే అథ్లెట్ (200 మీటర్ల పరుగు పందెం) తో 2 పతకాలు, టెన్నిస్‌లో 1, వెయిట్ లిఫ్టింగ్ నుంచి 1 పతకం లభించాయి. మరోవైపు టోక్యోలో ఈ ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్ జరగనున్నాయి.