కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ఎల్లప్పుడూ భారతీయ వెయిట్‌లిఫ్టర్లకు అత్యంత విజయవంతమైనవిగా నిరూపితమవుతున్నాయి. ఇక్కడ భారత వెయిట్ లిఫ్టర్లు ఇప్పటివరకు 43 బంగారు పతకాలతో సహా మొత్తం 125 పతకాలు సాధించారు. ఈ పతకాల సంఖ్య ఆస్ట్రేలియా (159 పతకాలు) తర్వాత కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అత్యంత విజయవంతమైన రెండవ దేశంగా భారత్‌ను నిలిపేలా చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాలు సాధించడంలో భారత జట్టు కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్న సందర్భాలు మూడు ఉన్నాయి. 1990, 2002, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ వెయిట్‌లిఫ్టర్లు అత్యధిక పతకాలు సాధించారు. గోల్డ్ కాస్ట్‌లో జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్‌లో, ఈ ఈవెంట్‌లో భారత్‌కు 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు వచ్చాయి. ఈసారి కూడా భారత వెయిట్‌లిఫ్టర్‌ల నుంచి అలాంటి ప్రదర్శననే ఆశించే ఛాన్స్ ఉంది.
ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నుంచి 15 మంది వెయిట్ లిఫ్టర్ల బృందాన్ని పంపుతున్నారు. ప్రతీ ఒక్కరికి పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది. మహిళల 49 కేజీల విభాగంలో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను పతకం ఖాయమయ్యే ఛాన్స్ ఉంది. ఆమెతో పాటు బిందియారాణి (55 కేజీలు), పాపీ (59 కేజీలు) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జెరెమీ లాల్రిన్‌నుంగా (67 కేజీలు) కూడా స్వర్ణం గెలవాలనే ఆశతో ఉన్నాడు. అచింత షెయులీ (73 కేజీలు), అజయ్ సింగ్ (81 కేజీలు) కూడా వారి వారి ఈవెంట్లలో టైటిల్ గెలవడానికి పోటీదారులుగా చెబుతున్నారు.
గతసారి కంటే ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఎక్కువ పతకాలు తీసుకురావడమే మా లక్ష్యం అని భారత వెయిట్‌లిఫ్టర్స్ జట్టు ప్రధాన కోచ్ విజయ్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈసారి 4 నుంచి 5 స్వర్ణాలు తెస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
భారత వెయిట్‌లిఫ్టర్స్ జట్టు:
మహిళలు: మీరాబాయి చాను (49 కేజీలు), బిందియారాణి దేవి (55 కేజీలు), పాపీ హజారికా (59 కేజీలు), హర్జిందర్ కౌర్ (71 కేజీలు), పూనమ్ యాదవ్ (76 కేజీలు), ఉషా కుమారి (87 కేజీలు), పూర్ణిమ పాండే (+87 కేజీలు)
పురుషులు: సంకేత్ సాగర్ (55 కేజీలు), గురురాజా పూజారి (61 కేజీలు), జెరెమీ లాల్రిన్నుంగ, అచింత షెలీ (73 కేజీలు), అజయ్ సింగ్ (81 కేజీలు), వికాస్ ఠాకూర్ (96 కేజీలు), లవ్‌ప్రీత్ సింగ్ (109 కేజీలు), గుర్దీప్ సింగ్ (+109 కేజీలు)