AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah : 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు.. బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?

Jasprit Bumrah : ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. కేవలం 8 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన బుమ్రా ఫామ్‌పై కోచ్ కీరన్ పొలార్డ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతుగా నిలిచారు.

Jasprit Bumrah : 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు..  బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
Bumrah
Rakesh
|

Updated on: Apr 30, 2026 | 2:46 PM

Share

Jasprit Bumrah : ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాక్ బోన్ లాంటి వాడు, ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. కానీ, ఐపీఎల్ 2026లో మాత్రం బుమ్రా తన పాత మెరుపును కోల్పోయి తడబడుతున్నాడు. కేవలం అభిమానులే కాదు, ఇప్పుడు ఏకంగా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కూడా బుమ్రా ఫామ్‌లో లేడనే కఠిన సత్యాన్ని బహిరంగంగానే అంగీకరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 243 పరుగులు చేసినా, బుమ్రా దారుణంగా విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాధారణంగా ఈ స్కోరును డిఫెండ్ చేయడం ఏ జట్టుకైనా సులభమే. కానీ, బుమ్రా ఏకంగా 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో హైదరాబాద్ 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం కోచ్ పొలార్డ్ మాట్లాడుతూ.. “నిజమే, బుమ్రా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇది మేము అంగీకరించాల్సిన కఠిన వాస్తవం” అని స్పష్టం చేశారు. ఒక సీజన్ మొత్తం మీద ఇప్పటివరకు 80 బంతులు వేసిన బుమ్రాకు కేవలం రెండే వికెట్లు దక్కడం అతని స్థాయికి ఏమాత్రం తగని గణాంకాలు చెబుతున్నాయి.

బుమ్రా విఫలమవుతున్నాడని చెబుతూనే, పొలార్డ్ అతనికి మద్దతుగా నిలిచారు. “ఏ క్రికెటర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ కోల్పోతాడు. బుమ్రా ఏళ్ల తరబడి ముంబైకి, భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఒక మనిషిగా తప్పులు చేసే హక్కు అతనికి కూడా ఉంది. ఒక రోజు బాగుండకపోవచ్చు, లేదా ఒక సీజన్ మొత్తం కలిసి రాకపోవచ్చు. కానీ అతని గత ఘనతను మనం మర్చిపోకూడదు” అని పొలార్డ్ వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు ఎప్పుడూ కెమెరాల కంటికి చిక్కుతూ ఉంటారని, వారి వైఫల్యాలను భూతద్దంలో చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ 2026 బుమ్రాకు ఒక పీడకలలా మారిపోయింది. ఆరంభంలో ఐదు మ్యాచ్‌ల వరకు అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కేవలం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై తలో వికెట్ మాత్రమే తీయగలిగాడు. సాధారణంగా ఎకానమీ 6 లేదా 7 లోపు ఉండే బుమ్రా, ఇప్పుడు ధారాళంగా పరుగులు ఇస్తుండటం ముంబై జట్టును కలవరపెడుతోంది. 8 మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. బుమ్రా లాంటి ప్రధాన బౌలర్ వికెట్లు తీయకపోవడమే ముంబై పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. “మేము ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాం, దానిని కాదనలేం. కానీ మా బౌలర్లు, ముఖ్యంగా బుమ్రా మళ్ళీ పుంజుకుంటారని ఆశిస్తున్నాం” అని పొలార్డ్ ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌గా పేరున్న బుమ్రా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం క్రికెట్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us