T20 WORLD CUP: విరాట్ కోహ్లీ తప్పేమి లేదు.. కాని.. నోబాల్ నిర్ణయంపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్లు..

టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో నాలుగో బంతిని నోబాల్ గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది అంఫైర్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. పాకిస్తాన్..

T20 WORLD CUP: విరాట్ కోహ్లీ తప్పేమి లేదు.. కాని.. నోబాల్ నిర్ణయంపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్లు..
Virat Kohli
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 24, 2022 | 9:57 PM

టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో నాలుగో బంతిని నోబాల్ గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది అంఫైర్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అంఫైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో విరాట్ కోహ్లీ తప్పేమి లేదంటూ.. తప్పంతా అంఫైర్ దే నని అంటున్నారు. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ పాకిస్తాన్ పై గెలిచింది. అయితే పాకిస్తాన్ బౌలర్‌ నవాజ్‌ వేసిన 20వ ఓవర్ లో నో బాల్ నిర్ణయం వివాదానికి దారితీసింది. నో బాల్ అప్పీల్‌ చేసుకొనే హక్కు ఒక బ్యాట్స్ మెన్ కు ఉంటుందని, విరాట్ కోహ్లీ అదే చేశాడని పాక్‌ మాజీ క్రికెటర్ల వసీం అక్రమ్, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ మాలిక్‌ అన్నారు. అయితే ఇదే సమయంలో అంఫైర్ ఎరాస్మస్‌ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు వెలువడటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో జరిగిన చర్చలో వారు మాట్లాడుతూ నోబాల్ నిర్ణయంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

బంతిని చూస్తే కిందకు దిగుతున్నట్లుగానే అనిపించిందని, బాల్ ఏ ఎత్తులో వెళ్లిందో చెక్‌ చేసే కెమెరాలోనూ నోబాల్‌గా కనిపించలేదన్నారు. స్లో మోషన్‌లో కూడా దిగుతుందేమో అనిపించేలా ఉందని, అయితే బ్యాటర్‌కు నో బాల్‌ గురించి అడిగే హక్కుందని వారు అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ పొరపాటు అస్సలు లేదని అంటూనే ఇలాంటి పెద్ద మ్యాచుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటే బాగుండేదన్నారు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా వివాదాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం అలేదన్నారు వసీం అక్రమ్.

మరో పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అడిగే వరకు కాకుండా లెగ్‌ అంపైర్‌ నేరుగా నో బాల్‌ను ప్రకటిస్తే సరిపోయేదని, లెగ్ అంపైర్‌ కచ్చితంగా లైన్‌ అంపైర్‌ దృష్టికి తీసుకెళ్లి థర్డ్ అంపైర్‌కు నివేదిస్తే బాగుండేదన్నారు. అది నో బాల్ అవునా.. కాదా.. అనేదానిపై తాను మాట్లాడబోనని, ఈ వివాదంలోకి తలదూర్చదలుచుకోలేదన్నారు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకొనే ముందు థర్డ్ అంఫైర్ తో సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కి వదిలేస్తే బాగుండేదని వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు.

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇదే విషయంపై స్పందిస్తూ.. అంఫైర్లు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదస్పదమవుతాయనుకున్నప్పుడు.. అటువంటి నిర్ణయాల్లో థర్డ్‌ అంపైర్ జోక్యం ఉండాల్సిందేనన్నారు. అవకాశం ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవడంలో తప్పులేదన్నారు. ఇటువంటి పెద్ద మ్యాచుల్లో కీలక సమయంలో నిర్ణయాలు కచ్చితంగా ఉండాలన్నారు. ఎవరైనా పొరపాట్లు చేయడం సహజమని, థర్డ్ అంపైర్‌ను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. రీప్లేలో చూసి నిర్ణయం తీసుకొని ఉండే పరిస్థితి వేరేగా ఉండేదని, వివాదాస్పదం కాకుండా ఉండేదేమోనని షోయబ్‌ మాలిక్ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..