శ్రేయాస్ అయ్యర్… ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో టీమిండియా తరపున మిడిల్ ఆర్డర్‌లో అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. మూడు మ్యాచులూ పరిశీలిస్తే.. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లలో శ్రేయాస్ అయ్యర్‌దే అత్యధిక స్ట్రైక్ రేట్(183.05). ఇక ఇప్పుడు ఇతడి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ టీ20 మ్యాచుల్లో నెంబర్ 4 స్థానంలో దిగి అతడు పరుగులన్నీ రాబట్టాడు.
ఇదిలా ఉండగా టీమిండియాకు నెంబర్ 4 స్థానం ఎప్పటినుంచో సమస్యగా మారింది. గతంలో ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా విరాట్ కోహ్లీ చాలామందిని ఈ ప్లేస్‌లో ప్రయత్నించగా.. అందరూ కూడా విఫలమయ్యారు. ఇక ప్రపంచకప్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రీసెంట్‌గా జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో సైతం ఇండియా తరపున మూడు మ్యాచులకు గానూ అత్యధిక పరుగులు(108) సాధించాడు.
అయ్యర్ జట్టులో చోటు సంపాదించిన తర్వాత వన్డేలు, టీ20ల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ.. స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలుస్తున్నాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌ను గమనిస్తే.. టీమిండియాకు తప్పకుండా నాలుగో స్థానం భర్తీ అయిందనే చెప్పాలి.