అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి పోరు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కె), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి) మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం లో జరగనుంది. ఇకపోతే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్లు సీజన్ ని ఘనంగా ఆరంభించాలని అనుకుంటున్నారు. కాగా ఐపీఎల్ లో చెన్నైను ఓడించడం రాయల్ ఛాలెంజర్స్ కు అంత తేలిక కాదు. గత గణాంకాలు చూస్తే చెన్నైకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఇక ఇరు జట్లూ ఇప్పటివరకూ 22 మ్యాచుల్లో తలపడగా సీఎస్కె 14 సార్లు విజయం సాధించగా.. 8 సార్లు మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విశేషం ఏంటంటే.. గత 11 సీజన్లగా చిదంబరం స్టేడియంలో సీఎస్కె పై ఆర్సీబీ విజయం సాధించకపోవడం గమనార్హం. 2008 లో మే 21న సీఎస్కెపై 14 పరుగులు తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆ జట్టుపై గెలవలేకపోయింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన గత ఆరు మ్యాచుల్లోనూ ధోనిసేనే విజయం సాధించింది. అందుకే రేపు జరగబోయే మ్యాచ్ పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు సార్లు టైటిల్ గెలిచి జోష్ మీద ఉన్న చెన్నైను ఈసారైనా రాయల్ ఛాలెంజర్స్ ఓడిస్తుందో లేదో చూడాల్సిందే.