T20 World Cup: మరో భారత్ బౌలర్ కు గాయం.. ఇక టీ20 ప్రపంచకప్ కు మిగిలిన ఆప్షన్లు అవేనా..
టీ20 ప్రపంచకప్ దగ్గరపడుతున్న కొద్దీ భారత క్రికెట్ జట్టుకు మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు గాయం కారణంగా టీ20..
టీ20 ప్రపంచకప్ దగ్గరపడుతున్న కొద్దీ భారత క్రికెట్ జట్టుకు మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యారు. ప్రస్తుతం మరో బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ప్రపంచకప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్ చాహర్ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయమైంది. ఈ కారణంగా అతను తొలి వన్డేలోనే కూడా ఆడలేదు. గాయం చిన్నదే అనుకున్నప్పటికి.. వైద్యుల పరీక్ష అనంతరం అతడికి విశ్రాంతి సూచించడంతో చివరి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న దీపక్ చాహర్, ఇటీవలే భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ప్రపంచకప్‌కు స్టాండ్‌బై ప్లేయర్ గా ఎంపికైనప్పటికీ అతణ్ని జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు. ప్రాక్టీస్ గా ఉంటుందని దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ జట్టుకు ఎంపికచేశారు. అయితే చీలమండ మెలిక పడడంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. మరి దీపక్ చాహర్ టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్య సమయానికి అందుబాటులో ఉంటాడో లేడో అనేది తెలియరాలేదు. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యుల నివేదిక ప్రకారం బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. దీపక్ చాహర్ తో పాటు మహ్మద్ షమి స్టాండ్ బై బౌలర్లుగా ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని టీ20 ప్రపంచకప్ లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తారనే ప్రచారం సాగింది. మరోవైపు మహ్మద్ సిరాజ్ ను ఎంపిక చేస్తారనే వాదన లేకపోలేదు. ఇప్పుడు దీపక్ చాహర్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ కు దూరమైతే మహ్మద్ షమీ లేదా మహ్మద్ సిరాజ్ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.
దీపక్ చాహర్ చీలమండ గాయం తీవ్రమైనది కాదని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచించడంతోనే అతడు దక్షిణాఫ్రికాతో అక్టోబర్9, 11 తేదీల్లో జరగనున్న రెండు వన్డేలకు దూరమయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చేరుకుంది. ఈ నెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ సూపర్ 12లో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈలోపు పెర్త్‌లోనే అయిదు రోజుల పాటు ఉండనున్న భారత ఆటగాళ్లు అక్కడే ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నెల 10, 13 తేదీల్లో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. తర్వాత జట్టు బ్రిస్బేన్‌కు వెళ్తుంది. ఈ నెల 17న ఆస్ట్రేలియాతో భారత్‌కు వార్మప్ మ్యాచ్ కూడా ఉంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌కు వెళ్తుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో జట్టు సభ్యులైన ప్రపంచకప్ స్టాండ్‌బై ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక, నేరుగా బ్రిస్బేన్ వెళ్లి జట్టులో కలిసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌కు స్టాండ్‌బై ప్లేయర్ గా ఎంపికై, కొవిడ్ బారిన పడి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ అకాడమీలో ఉన్నాడు. అతను ఫిట్‌నెస్ సాధిస్తే మిగతా ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరే అవకాశం ఉంది.
నెట్ బౌలర్లుగా ముకేశ్, సకారియా
టీ20 ప్రపంచకప్ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్ కోసం ఇద్దరు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున సత్తా చాటిన ముకేశ్ చౌదరి, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన చేతన్ సకారియా నెట్ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వీళ్లిద్దరూ జట్టుకు సేవలందించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..