AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ ఈసారైనా ట్రోఫీ గెలుస్తుందా..!

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ట్రోఫీ గెలవాలనే కల ఇంకా వాళ్ళకి అందని ద్రాక్షనే. సమిష్టి ప్రదర్శన కరువై వరస ఓటములతో ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ రికార్డులు లేని ఈ జట్టు ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టి ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మనం […]

ఢిల్లీ ఈసారైనా ట్రోఫీ గెలుస్తుందా..!
Ravi Kiran
|

Updated on: Mar 21, 2019 | 4:38 PM

Share

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ట్రోఫీ గెలవాలనే కల ఇంకా వాళ్ళకి అందని ద్రాక్షనే. సమిష్టి ప్రదర్శన కరువై వరస ఓటములతో ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ రికార్డులు లేని ఈ జట్టు ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టి ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఒకసారి వాళ్ళ బలం, బలహీనతలను ఇప్పుడు చూద్దాం.

అసలు ఢిల్లీ జట్టు పూర్వ వైభవం గురించి మనం చూస్తే.. వారు కేవలం మూడు సార్లు మాత్రమే టాప్ 4 లో నిలిచారు. ప్రతీసారి భారీ అంచనాలు, బలగాలతో దిగి.. నిలకడైన ప్రదర్శనలో విఫలమవుతూ ట్రోఫీను ఇంతవరకు అందుకోలేకపోయారు. ఇక ఇలా కాదని ఈ ఏడాది కొత్త పేరుతో.. తమ బలగాలను బాగా పెంచుకుని బరిలోకి దిగుతోంది ఢిల్లీ జట్టు.

బలం:

ఈ ఏడాది ఢిల్లీ జట్టులో అటు మెరుగైన యువ క్రికెటర్లు, ఇటు సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్ కు శిఖర్ ధావన్, కొలిన్ ఇంగ్రామ్, క్రిస్ మోరిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ తోడైతే ఢిల్లీ జట్టు దశ తిరిగినట్లే. ఇక ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవు లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ చాలామంది ఈ జట్టులో ఉన్నారు. గత సీజన్ లో అదరగొట్టిన పంత్, భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ లపై ఈ జట్టు భారీ ఆశలు పెట్టుకుందనే చెప్పాలి.

బలహీనతలు:

ధావన్, పృథ్వీ షా, కోలిన్ మున్రోల రూపంలో ఓపెనర్స్ శుభారంభాన్ని ఇచ్చినా.. ఢిల్లీకి మిడిలార్డర్ పెద్ద ఇబ్బందిగా మారింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు.. కొత్తగా టీమ్ లోకి వచ్చిన ఇంగ్రామ్, హనుమాన్ విహారి ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఇక ఢిల్లీ జట్టుకు ఒక్కరు కూడా లీగ్ చివరివరకు చెప్పుకోదగ్గ విదేశీ ఫాస్ట్ బౌలర్లు లేరు. ట్రెంట్ బౌల్ట్, రబడా, మోరిస్ ఉన్నా.. వారు ప్రపంచకప్ కోసం లీగ్ మధ్యలోనే వెళ్ళిపోతారు. కాగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈసారి ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాల్సిందే.

అవకాశాలు:

ఐపీఎల్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్న ఢిల్లీ జట్టుకు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ కాగా సౌరవ్ గంగూలీ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ జట్టు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడితే ఖచ్చితంగా ఈసారి ప్లే-ఆఫ్స్ కు చేరుతుందని అంచనా. ఇక జాతీయ జట్టు తరపున అంతగా ఆకట్టుకోలేకపోతున్న పంత్ కు ఐపీఎల్ రూపంలో మంచి అవకాశం ఉందని చెప్పాలి. చూద్దాం అసలు ఏమి జరుగుతుందో.