AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీ మళ్లీ ఆడతాడా… టీమిండియాకు అతడి అవసరం ఉందా?

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో ధోని రిటైర్మెంట్‌ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. టీమిండియా సైతం ప్రపంచకప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చి సంగతి తెలిసిందే. బీసీసీఐ, ధోనీ నుంచి మాత్రం ఈ విషయంలో మౌనమే సమాధానం అయింది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు, దక్షిణాఫ్రికాతో […]

ధోనీ మళ్లీ ఆడతాడా... టీమిండియాకు అతడి అవసరం ఉందా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 1:57 AM

Share

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో ధోని రిటైర్మెంట్‌ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. టీమిండియా సైతం ప్రపంచకప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చి సంగతి తెలిసిందే. బీసీసీఐ, ధోనీ నుంచి మాత్రం ఈ విషయంలో మౌనమే సమాధానం అయింది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు, దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం ఆడుతున్న టీ20 సిరీస్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. అయితే, ధోనీ ఆటలో కొనసాగుతాడా లేదా అన్న విషయంలో సస్పెన్స్‌కు తావు లేదని క్రికెట్ విశ్లేషకుడు అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.

”ఆడాలా, లేదా అన్నది ధోనీ స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయమే. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనుకుంటే, అతడే ఆ విషయాన్ని అందరి ముందుకూ వచ్చి చెబుతాడు. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదు” అని ఆయన అన్నారు. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ ఇటీవల చేసిన ఓ ట్వీట్ ధోనీ రిటైర్ అవుతున్నాడన్న ఊహాగానాలకు కారణమైంది. ధోనీతో కలిసి ఆడిన ఓ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో కోహ్లీ పోస్ట్ చేశాడు. ”ఈ మ్యాచ్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. అదొక గొప్ప రోజు. ఫిట్‌నెస్ టెస్ట్ పెట్టినట్లు ధోనీ నన్ను పరుగెత్తించాడు” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రత్యేక సందర్భమేమీ లేకుండా కోహ్లీ ఈ ఫొటో షేర్ చేయడంతో చాలా మంది ధోనీ రిటైర్ అవబోతున్నాడేమోనని సందేహాలు వ్యక్తం చేశారు.

ధోనీ క్రికెట్‌లో కొనసాగాలంటూ #NeverRetireDhoni, #DhoniForever హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు వెల్లువెత్తాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికి ధోనీ రిటైర్మెంట్ వార్తలన్నీ వదంతులేనంటూ అతడి భార్య సాక్షి సింగ్ ధోనీ ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చారు. ధోనీ రిటైర్మెంట్ గురించి వచ్చిన వార్తలు వదంతులే అయినా భవిష్యత్తులో అతడి స్థానాన్ని భర్తీ చేయబోయేదెవరన్న చర్చకు అవి దారితీశాయి. ‘

ధోనీ స్థానంలో ఎవరు రావాలన్నది చాలా పెద్ద ప్రశ్న. దీనికి జవాబుగానే కొన్ని నెలలుగా రిషభ్ పంత్‌ను భారత జట్టు సిద్ధం చేసుకుంటోంది. ధోనీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అలాంటప్పుడు వన్డే, టీ20 ఫార్మాట్లలోనే ధోనీతో పంత్‌ను మనం పోల్చిచూడాల్సి ఉంటుంది. ప్రపంచకప్ టోర్నీలో ధోనీ, పంత్ కలిసే ఆడారు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా రెండింట్లో భారత్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో 20 పరుగులు చేసిన పంత్, మరో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మూడు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో సున్నాకే ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లో నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. చివరి మ్యాచ్‌లో మాత్రం అజేయంగా 65 పరుగులు చేశాడు. గణాంకాలపరంగా చూస్తే ఇప్పుడైతే ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల స్థాయిలో మాత్రం పంత్ కనపడటం లేదు.

టీమ్ ఇండియాకు ధోనీ అవసరం ఇంకా చాలా ఉంది. జట్టు కెప్టెన్ కోహ్లీ కూడా చాలా సార్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉండటం జట్టుకు చాలా ఉపకరిస్తుందని కోహ్లీ తెలిపాడు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అనుభవానికి చాలా విలువ ఉంటుంది. తాను ఆడుతున్నన్నీ రోజులూ ధోనీ జట్టుకు చాలా కీలకమవుతాడు. టీమ్ ఇండియా తదుపరి లక్ష్యం వరల్డ్ టీ20 ట్రోఫీ. ఇందుకోసం సరైన జట్టును సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధోనీలాగా బాధ్యతగా ఆడే ఆటగాళ్లు ఎంతమంది తయారవుతారన్నది చూడాల్సి ఉంటుంది. చాలా మంది కన్నా ధోనీనే మెరుగైన ఆటగాడిగా అప్పటికీ అనిపించవచ్చు.