AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : ప్రపంచ విజేతలకు బిజీ షెడ్యూల్.. 9 నెలల్లో రెండుసార్లు సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా

Team India : భారత మహిళా క్రికెట్ జట్టు 2026లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలకు సిద్ధమవుతోంది. లార్డ్స్, సెయింట్ జార్జ్ పార్క్‌లో చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతుంది. ఈ సిరీస్ ద్వారా వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టనుంది.

Team India : ప్రపంచ విజేతలకు బిజీ షెడ్యూల్.. 9 నెలల్లో రెండుసార్లు సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా
Team India
Rakesh
|

Updated on: Mar 21, 2026 | 7:03 AM

Share

Team India : ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, రాబోయే రోజుల్లో చాలా బిజీ షెడ్యూల్‌తో ఉండబోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మన అమ్మాయిలు విజయాల జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చిన టీమిండియా, ఈ ఏడాది ఏకంగా రెండుసార్లు సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టబోతోంది. అంతేకాదు, క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో కూడా మన మహిళా జట్టు చారిత్రక టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం విడుదల చేసిన హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకారం, భారత మహిళల జట్టు ఈ ఏడాది రెండుసార్లు అక్కడ పర్యటించనుంది. మొదటి విడతగా ఏప్రిల్ నెలలో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టనుంది. ఇక రెండో విడతగా డిసెంబర్ నెలలో మళ్లీ ఆఫ్రికా గడ్డపైకి వెళ్లనున్న మన అమ్మాయిలు.. అక్కడ వన్డే, టెస్ట్ సిరీస్ ఆడతారు. డిసెంబర్ 9, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు వరుసగా పోచెఫ్‌స్ట్రూమ్, బ్లూమ్‌ఫోంటెన్, కేప్‌టౌన్ వేదికలుగా జరగనున్నాయి.

66 ఏళ్ల తర్వాత చారిత్రక టెస్ట్ మ్యాచ్

సౌతాఫ్రికా పర్యటనలో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే.. డిసెంబర్ 20 నుంచి 23 వరకు గెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్)లోని సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్. ఈ మైదానంలో మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం ఏకంగా 66 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 1960లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై మన భారత జట్టు తలపడటం ఒక అరుదైన గౌరవంగా భావించవచ్చు.

ఇంగ్లాండ్ పర్యటన, లార్డ్స్ మైదానం

రెండు సౌతాఫ్రికా పర్యటనల మధ్యలో, మే నెల చివరలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మొదట ఇంగ్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగానే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జూలైలో ఇంగ్లాండ్‌తో చారిత్రక లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. లార్డ్స్ వేదికగా భారత మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడటం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

వరల్డ్ ఛాంపియన్ల హోదాలో వేట

ప్రస్తుతం భారత మహిళా జట్టు తిరుగులేని ఫామ్‌లో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా, ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఈ విదేశీ పర్యటనలకు వెళ్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ వంటి స్టార్ ఆటగాళ్లతో భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. టీ20, వన్డేలతో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లో కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భారత అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us