AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup 2026 : మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు.. విన్నర్‌కు ఎన్ని కోట్లంటే!

Womens T20 World Cup 2026 : ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. విజేత జట్టుకు రూ.22 కోట్లకు పైగా, రన్నరప్‌కు రూ.11 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకూ భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

Womens T20 World Cup 2026 :  మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు.. విన్నర్‌కు ఎన్ని కోట్లంటే!
Womens T20 World Cup 2026 (1)
Rakesh
|

Updated on: Jun 12, 2026 | 9:52 AM

Share

Womens T20 World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఒక చారిత్రాత్మక, సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ ప్రైజ్ మనీని ఐసీసీ ఊహించని రేంజ్‌లో పెంచింది. ఇది మహిళా క్రికెట్ సాధించిన వాణిజ్య విజయాన్ని, గ్లోబల్ మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, ఈసారి టోర్నమెంట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చేందుకు మరికొన్ని కొత్త మార్పులు కూడా చేశారు.

చరిత్రలోనే బిగ్గెస్ట్ టోర్నీ.. విన్నర్‌కు రూ.22 కోట్లు

ఈసారి జరగబోయే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా నిలిచిపోనుంది. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం 12 జట్లు ఈ మెగా సమరంలో తలపడనున్నాయి. ఐసీసీ ప్రకటించిన కొత్త ప్రైజ్ మనీ వివరాల ప్రకారం.. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి కప్పు గెలుచుకునే జట్టుకు ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైగా నగదు బహుమతి లభించనుంది. అలాగే రన్నరప్‌గా నిలిచే జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11 కోట్లు) అందజేయనున్నారు.

పాల్గొన్న ప్రతి జట్టుకూ కాసుల వర్షం

ఐసీసీ కేవలం ఫైనల్ చేరిన జట్లకే కాకుండా.. టోర్నీలో ఆడే ప్రతి జట్టుకూ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే మొత్తం 12 జట్లకు ఒక్కో జట్టుకు 247,500 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) పార్టిసిపేషన్ ఫీజు కింద ఖచ్చితంగా అందనుంది. దీనితో పాటు సెమీఫైనల్స్ వరకు వచ్చి ఓటమిపాలయ్యే రెండు జట్లకు కూడా తలా రూ.6.56 కోట్ల చొప్పున భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. మహిళా క్రికెటర్లను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఐసీసీ ఈ తరహా పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది.

మారిన వరల్డ్ కప్ ఫార్మాట్

ఈసారి టోర్నీని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేసింది. టోర్నీలో పాల్గొనే 12 జట్లను చెరో 6 జట్లతో రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇంగ్లాండ్‌లోని 7 వేర్వేరు అంతర్జాతీయ మైదానాల్లో మొత్తం 33 ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి.

గ్రూప్ వివరాలు.. భారత్, పాకిస్తాన్ లీగ్ ఫైట్

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం అభిమానులకు అసలైన క్రికెట్ కిక్‌ను ఇవ్వనుంది. గ్రూప్-1 లో భారత్, పాకిస్తాన్‌లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-2 లో ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. పెరిగిన ప్రైజ్ మనీ, జట్ల సంఖ్యను బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పురుషుల క్రికెట్ తరహాలోనే మహిళల క్రికెట్ కూడా ప్రపంచ క్రీడా రంగంలో సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించబోతోందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us