Team India: భారత్‌లో పుట్టాడు.. ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే.?
ఈ ఆటగాడు భారత్‌లో పుట్టాడు.. కట్ చేస్తే.. ఆస్ట్రేలియా తరపున బ్యాట్ పట్టాడు.. అంతేకాదు ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో.? అతడు స్కోర్ చేసిన రన్స్ ఎన్ని అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ లుక్కేయండి మరి.

ఏ దేశంలోనైనా పలువురు క్రికెటర్లు.. ఆ దేశ క్రికెట్ బోర్డు తమకు ఛాన్స్‌లు ఇవ్వకపోతే.. విదేశీ జట్ల తరపున బరిలోకి దిగుతుంటారు. మన భారత ఆటగాళ్లు అయితే కోకొల్లలు. గతంలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు పలువురు విదేశీ టోర్నమెంట్లలో తమ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలలో చాలామంది భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆ కోవకు చెందిన ఓ ప్లేయర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా.. అనుకోకుండా విదేశాలకు వెళ్లిన అతడు అక్కడే చిక్కుకుని స్థిరపడిపోయాడు. మరి అతడెవరో కాదు.. నిఖిల్ చౌదరి.
2016-17 మధ్య పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ టోర్నమెంట్లు ఆడుతున్నాడు. అక్కడ అతడు అటు బంతితో.. ఇటు బ్యాట్‌తో ప్రత్యర్ధులను ఊచకోత కోశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నమెంట్ షెఫ్ఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ 2025-26 జరుగుతోంది. ఈ టోర్నీ 13వ మ్యాచ్‌లో న్యూసౌత్ వేల్స్, టాస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్మానియా జట్టు తరపున బరిలోకి దిగిన నిఖిల్ చౌదరి అద్భుతమైన సెంచరీ సాధించడమే కాకుండా.. మొత్తంగా 163(9 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల భారీ స్కోర్ సాధించి.. ఆ టోర్నీలో సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
నిఖిల్ విధ్వంసంతో టాస్మానియా జట్టు 8 వికెట్ల నష్టానికి 623 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో టిమ్ వార్డ్(119), జెవెల్(102) రాణించారు. అటు బ్యాట్‌తోనే కాదు.. ఇటు బంతితోనూ అదరగొట్టాడు నిఖిల్ చౌదరీ. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. కోవిడ్ సమయంలో టూరిస్ట్ విసా మీద ఆస్ట్రేలియా వెళ్లిన నిఖిల్ చౌదరీ.. తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. బ్రతుకుతెరువు కోసం అక్కడే పనులు చేస్తూ.. అలాగే క్లబ్ క్రికెట్ ఆడుతూ ఉండిపోయాడు. ఇక అతడి ఆటతీరు చూసిన ఓ కోచ్.. ఆపై హబర్ట్ హర్రికేన్స్ జట్టులో చేరాడు.
