Champions Trophy: మా టీమ్‌లో మస్తు టాలెంట్ ఉంది.. అది పెద్ద విషయం కాదు: పాక్ కెప్టెన్ రిజ్వాన్
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు నిరాశపరిచే ప్రదర్శన కనబర్చింది. న్యూజిలాండ్, భారత జట్లతో వరుస ఓటములతో టోర్నీ నుండి నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్థాన్ ఒక్క విజయం సాధించకుండానే టోర్నీ ముగించింది. పాక్ ప్రదర్శనపై పాక్ కెప్టెన్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓడిపోవడంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్.. గురువారం బంగ్లాదేశ్‌తో మిగిలిన నామమాత్రపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక్క విజయం కూడా లేకుండా ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ముగించాల్సి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం రావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంతో సంతోష పడింది. తమ దేశంలో మళ్లీ క్రికెట్‌కు పూర్వవైభవం రాబోతుందని కలలు కనింది.
అలాగే ఆ దేశ క్రికెట్ అభిమానులు, పాక్ క్రికెట్ బోర్డు తమ దేశపు జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎలాగో తమ దేశంలో జరిగే టోర్నీలో పాకిస్థాన్ జట్టు మంచి ప్రదర్శన కనబర్చి, కప్పు గెలుస్తుందని భావించారు. కానీ, తీరా టోర్నీ నుంచి ఒక్క మ్యాచ్ గెలవకుండా పాక్ నిష్క్రమించింది. ఐసీసీ టోర్నీని హోస్ట్ చేస్తూ ఒక్క మ్యాచ్ గెలవని మూడో జట్టుగా పాకిస్థాన్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. గతంలో కెన్యా, స్కాట్లాండ్ జట్లు ఈ చెత్త రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ కూడా వాటి సరసన చేరింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫేలవ ప్రదర్శనకి ఆ జట్టులో కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు గాయపడటం కూడా ఒక కారణం.
అయితే ఇదే విషయంపై బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. “ఛాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌పై పాక్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వాటిని తాము అందుకోలేకపోయాం. అయితే ఆటలో ఇలాంటివి సహజం. మా ఓటమిల నుంచి, తప్పిదాల నుంచి మేం నేర్చుకుంటాం. మరోసారి న్యూజిలాండ్‌పై అలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు యువ ఆటగాడు సైమ్ అయ్యూబ్ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత ఓపెనర్ ఫకర్ జమాన్ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు. అయితే వాళ్లిద్దరూ దూరం అవ్వడంతోనే మేం మంచి ప్రదర్శన చేయలేకపోయాం అని నేను అనను. దాన్ని మేం సాకుగా తీసుకోవడం లేదు. ఎందుకంటే మా జట్టులో అద్భుతమైన టాలెంట్ ఉంది.” అని రిజ్వాన్ పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




