IND vs AUS: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపు బంతులకు గాల్లో ఎగిరిన వికెట్లు.. దెబ్బకు రికార్డు బద్దలు

|

Mar 02, 2023 | 4:02 PM

మొదట స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను ఎల్బీగా ఔట్‌ చేసిన ఉమేశ్‌ ఆతర్వాత మిచెల్‌ స్టార్క్‌, మర్ఫీలను బుల్లెట్లలాంటి బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పేస్‌ బౌలర్‌ మెరుపు బంతులకు స్టా్ర్క్‌, మర్ఫీ వికెట్లు గాల్లో ఎగరడం విశేషం.

IND vs AUS: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపు బంతులకు గాల్లో ఎగిరిన వికెట్లు.. దెబ్బకు రికార్డు బద్దలు
Umesh Yadav
Follow us on

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. కేవలం 5 ఓవర్లు వేసిన అతను 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు నేలకూల్చాడు. మొదట స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను ఎల్బీగా ఔట్‌ చేసిన ఉమేశ్‌ ఆతర్వాత మిచెల్‌ స్టార్క్‌, మర్ఫీలను బుల్లెట్లలాంటి బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.  టీమిండియా పేస్‌ బౌలర్‌ మెరుపు బంతులకు స్టా్ర్క్‌, మర్ఫీ వికెట్లు గాల్లో ఎగరడం విశేషం. ఉమేశ్‌తో పాటు రవీంద్ర జడేజా, అశ్విన్‌ రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు కీలక ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 156/4తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఉమేశ్‌, అశ్విన్‌ల ధాటికి కేవలం 41 పరుగులు జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది.

కాగా ఈ టెస్టుకు ముందు ఉమేశ్‌ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తండ్రి తిలక్​ యాదవ్​ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఆ సమయంలో ఉమేశ్‌ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేశ్‌. తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ఈక్రమంలో ఉమేశ్‌ నిబద్ధతపై క్రికెట్‌ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 3 వికెట్లు తీసిన ఉమేశ్‌ స్వదేశంలో 100 వికెట్లు పడగొట్టిన 5వ పేసర్‌గా రికార్డుల కెక్కాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..