Video: 6,6,6,6,6,6,6,4,4.. 10 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 510 స్ట్రైక్ రేట్‌తో ధోని శిష్యుడి ఊచకోత చూశారా..!
Fastest Half Century in Cricket: క్రికెట్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించిన ఒక భారతీయ బ్యాటర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాడు. కేవలం 10 బంతుల్లోనే అర్ధశతకం బాది, ఊహకందని రీతిలో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన ఈ ఆటగాడు, అసాధారణ పోరాట పటిమతో అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసి రికార్డుల రారాజుగా నిలిచాడు.

Vinayak Shukla Fastest Half Century: అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ భారత సంతతికి చెందిన వినాయక్ శుక్లా అద్భుత రికార్డును నమోదు చేశాడు. హాంకాంగ్ ఇంటర్నేషనల్ సూపర్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విధ్వంసం చోటుచేసుకుంది. ఓమన్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వినాయక్, కేవలం 10 బంతుల్లోనే 51 పరుగులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన స్ట్రైక్ రేట్ ఏకంగా 510గా ఉండటం విశేషం.
సిక్సర్ల వర్షం.. బౌలర్ల బెంబేలు..
వినాయక్ శుక్లా ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ప్రతి బంతిని మైదానం వెలుపలికి పంపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆయన ధాటికి ఓమన్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 159 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 94 పరుగులకే పరిమితం కావడంతో, ఓమన్ 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీకి అంతర్జాతీయ హోదా ఉండటంతో వినాయక్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కాన్పూర్ వీధి నుంచి ఓమన్ జాతీయ జట్టు వరకు..
వినాయక్ శుక్లా ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. 1994లో కాన్పూర్‌లో జన్మించిన ఆయన, భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చిన్ననాటి స్నేహితుడు. క్రీడా రంగంలో రాణించాలనే పట్టుదలతో 2021లో ఓమన్‌కు వలస వెళ్లాడు. అక్కడ జీవనోపాధి కోసం ఒక సంస్థలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తూనే, రాత్రి వేళల్లో కఠినమైన శిక్షణ తీసుకునేవాడు. తన ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీని స్ఫూర్తిగా తీసుకుని, ఎట్టకేలకు 2024లో ఓమన్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం..
నిరంతర కృషితో వినాయక్ 2024 డిసెంబర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో వన్డేల్లో కూడా అరంగేట్రం చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఓమన్‌లో క్రికెట్ సీజన్ పరిమితంగా ఉన్నప్పటికీ, ఉద్యోగం చేస్తూనే క్రీడల పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. నేడు 10 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వీరుడిగా వినాయక్ శుక్లా పేరు మారుమోగిపోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
