
రాజస్థాన్ రాయల్స్ (RR) ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒకానొక దశలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న జట్టును చివరి బ్యాట్స్‌మెన్స్ అద్భుత ఆటతీరుతో ఆదుకున్నారు. ముఖ్యంగా 19, 20వ ఓవర్లలో బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు.
19వ ఓవర్లో ఒక వైడ్, సిక్సర్, ఫోర్‌తో కలిపి మొత్తం 16 పరుగులు రాగా, ఆఖరిదైన 20వ ఓవర్లో నో-బాల్, వరుస ఫోర్లతో ఏకంగా 14 పరుగులు పిండుకున్నారు. ఈ రెండు ఓవర్లలో వచ్చిన ధారాళమైన పరుగులే రాజస్థాన్ జట్టును 200 పరుగుల మార్కును దాటించాయి.
ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..
మిడిల్ ఆర్డర్ విఫలమైన వేళ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లీడింగ్ రోల్ తీసుకుంటూ 11 బంతుల్లోనే 19 పరుగులు చేసి జట్టుకు కొండంత అండగా నిలిచాడు. అతనికి తోడుగా వచ్చిన ఎన్ బర్గర్ కేవలం 3 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 10 పరుగులు జోడించి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి చివరి వికెట్‌కు కేవలం 12 బంతుల్లోనే 30 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రత్యర్థి జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. అంతకుముందు జోఫ్రా ఆర్చర్ ఆడిన 32 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కూడా జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
ప్రత్యర్థి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ తీవ్ర నిరాశపరిచింది. అతను తన కోటా 4 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టినప్పటికీ, ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో అతను వేసిన నో-బాల్, ఆ తర్వాత ఇచ్చిన వరుస బౌండరీలు రాజస్థాన్ రాయల్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాయి. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంలో విఫలమవడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం మరింత సులువైంది.
ముంబై జట్టు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న తరుణంలో, రెండో ఇన్నింగ్స్ కూడా అంతే రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఒక వేళ ముంబై జట్టు గెలిస్తే, రాజస్థాన్ ఈ రేసు నుంచి తప్పుకుంటుంది. అలాగే, పంజాబ్, కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులోకి వస్తాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..