టెస్ట్‌ మ్యాచ్‌లు అంతరించిపోకుండా జాగ్రత్తపడదాం! సుదీర్ఘ ఫార్మట్‌ క్రికెట్‌ను బతికించుకుందాం!

అహ్మదాబాద్‌లో అధునాతనంగా నిర్మించిన నరేంద్రమోదీ స్టేడియం భారత్‌కు బాగా కలిసివచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లోనూ టీమిండియా ఘన విజయాలను నమోదు చేసుకుంది.

టెస్ట్‌ మ్యాచ్‌లు అంతరించిపోకుండా జాగ్రత్తపడదాం! సుదీర్ఘ ఫార్మట్‌ క్రికెట్‌ను బతికించుకుందాం!
Test Cricket
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: Mar 18, 2021 | 3:43 PM

అహ్మదాబాద్‌లో అధునాతనంగా నిర్మించిన నరేంద్రమోదీ స్టేడియం భారత్‌కు బాగా కలిసివచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లోనూ టీమిండియా ఘన విజయాలను నమోదు చేసుకుంది. నాలుగో టెస్ట్‌ జరుగుతున్న సమయంలోనే లిటిల్‌మాస్టర్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఘనంగా సత్కరించింది.. సునీల్‌ మనోహర్‌ గవాస్కర్‌ టెస్ట్‌ల్లో అడుగుపెట్టి అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అతడిని సన్మానించింది బీసీసీఐ. 1971, మార్చి ఆరున తన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన గవాస్కర్‌ తర్వాతి కాలంలో జట్టులో కీలక సభ్యుడయ్యాడు. అప్పట్లో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌పై అందులోనూ పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్‌లో తొలి టెస్ట్‌ ఆడాల్సి రావడం ఓ విషమపరీక్షనే! గవాస్కర్‌ ఆ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. అటు పిమ్మట 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గవాస్కర్‌ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన తొలి టెస్ట్‌ సిరీస్‌లోనే గవాస్కర్‌ 774 పరుగులు చేశాడు.. ఇదో రికార్డు.. ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంది.. టెస్ట్‌ల్లో పది వేల పరుగుల మైలు రాయిని అధిగమించిన తొలి బ్యాట్స్‌మెన్‌ గవాస్కరే కావడం విశేషం.. ఇప్పుడు ప్రస్తావన గవాస్కర్‌ విశేషణాలు, అతడు సాధించిన రికార్డుల గురించి కాదు. గవాస్కర్‌కు సన్మానం జరిగిన రోజునే ఇండియా-ఇంగ్లాండ్‌ మధ్య ముగిసిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ గురించి చెప్పుకోవాలి. ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి దర్జాగా అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంది..! నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు మూడు రోజుల్లోపే ముగియడమే ఆందోళన కలిగిస్తున్న అంశం.. ఈ పిచ్‌లపై ఐసీసీ భేషంటూ కితాబులిస్తే ఇవ్వవచ్చు.. మనవాళ్లు కూడా ట్రాక్‌ను సమర్థించుకుంటే కోవచ్చు.. ఐసీసీనే శభాష్‌ అన్న తర్వాత మారు మాట్లాడేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ పెద్దలు మౌనంగా ఉంటే ఉండవచ్చు .. కానీ టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించినంత వరకు ఇది మాత్రం ప్రమాదకరం.. మూడో టెస్ట్ మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ఎందుకు ముగిసినట్టు? ఇంగ్లాండ్‌ వాళ్లకు ఆట చేతకాకనా? నిజంగానే పిచ్‌ నాసిరకంగా ఉందా? అన్న ప్రశ్నలను పక్కన పెట్టి అసలు అయిదు రోజుల మ్యాచ్‌లు ఇలా రెండు మూడు రోజుల్లోనే ముగియడం క్రికెట్‌కు క్షేమకరమేనా అన్నది ఆలోచించాలి. సిసలైన క్రికెట్‌కు పెట్టింది పేరైన టెస్ట్‌ మ్యాచ్‌లకు మాత్రం ఇలాంటి ఘటనలు ప్రమాదకరమే! ఇప్పుడు క్రికెట్‌ పక్కా వ్యాపారం. వ్యాపారస్తులు ఎప్పుడు లాభం కోసమే చూస్తారు. ఐసీసీ కానీ బీసీసీఐ కాని ఇందుకు మినహాయింపు కాదు..

నిజమే, టెస్ట్ క్రికెట్‌ లాభసాటి వ్యాపారం కాదు.. టీ-20 ఫార్మాట్‌ మ్యాచ్‌లోలా టెస్ట్‌కు సొమ్ములు రావు.. నాలుగు గంటల్లో ముగిసే టీ-20లకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.. ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో బోలెడన్ని లీగ్‌లు జరుగుతున్నాయి. మన దగ్గర ఐపీఎల్‌ లీగ్‌ నిర్వాహకులకు ఎంత డబ్బును తెచ్చిపెడుతున్నదో చూస్తున్నాం. టీ-20 మ్యాచ్‌ అయితే చాలు స్టేడియంలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ఫార్మాట్‌ రాకతో క్రికెట్‌ స్వరూపం పూర్తిగా మారిపోయింది. జెంటిల్మన్‌ గేమ్‌లో విపరీతమైన పోకడలు వచ్చేశాయి. టెక్నిక్‌ అన్న విషయాన్నే బ్యాట్స్‌మన్‌ మర్చిపోయారు.. టెక్ట్స్‌ బుక్‌ షాట్స్‌కు కాలం చెల్లింది.. ఎలా కొడితేనేం బాల్‌ బౌండరీకి చేరిందా లేదా అన్నదే పాయింటిప్పుడు! టీ-20లు కనకవర్షం కురిపిస్తుండటంతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అప్పట్లో ఓ దారుణమైన ప్రతిపాదన తీసుకొచ్చింది.. టెస్ట్ మ్యాచ్‌లను కూడా నాలుగు రోజులకు కుదిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తలు మొదలు పెట్టింది. అయిదు రోజుల టెస్ట్‌లను మూడు రోజులకు కుదిస్తే బెటరన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అయితే నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ల ప్రతిపాదన పట్ల చాలా విమర్శలు రావడం, లెజండరీ క్రికెటర్లందరూ ఇదో పిచ్చి ప్రతిపాదన అని తిట్టిపోయడంతో ఐసీసీ వెనక్కి తగ్గింది. అలాగని ఆ ప్రతిపాదనను పూర్తిగా అటకెక్కించలేదు.

ఏడాది కిందట, సరిగ్గా చెప్పాలంటే 2019-2020లో ఇంగ్లాండ్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్ట్‌ సిరీస్‌ను 3-1తో ఇంగ్లాండ్‌ గెల్చుకుంది. జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగానే సాగాయి.. ఫలితం రావడానికి అయిదు రోజులు పట్టింది. ఈ సిరీస్‌ టెస్ట్‌ క్రికెట్‌ను అభిమానించేవారికి ఉత్సాహాన్ని ఇచ్చింది. టెస్ట్‌లకు మళ్లీ ఆదరణ పెరుగుతుందనే నమ్మకం కలిగించింది. చాలా మంది క్రికెట్‌ విశ్లేషకులు టెస్ట్‌ల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. టెస్ట్‌ క్రికెటే అల్టిమేట్‌ అన్న భావనకు వచ్చారు చాలా మంది. అయితే ఐసీసీకి మాత్రం అయిదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లపై ఇంకా సదాభిప్రాయం లేనట్టే అనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ అభిమానులకు పసందైన విందును అందించింది. నిజానికి టెస్ట్‌ క్రికెట్‌కు అదో సంధికాలం. అప్పటికే ఆ ఫార్మాట్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంది.. అనేక ఉత్థానపతనాలను చవిచూసింది. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటిస్తున్నప్పుడు టెస్ట్ క్రికెట్ ఉనికి ప్రశ్నార్థకంగా ఉండింది.. టెస్ట్ క్రికెట్ చేసుకున్న పుణ్యమో, అభిమానుల అదృష్టమో టీమిండియా 2-1తో సిరీస్‌ను గెల్చుకుని టెస్ట్‌లకు ప్రమాదం లేదని నిరూపించింది. అయిదు రోజుల ఫార్మాట్‌ విలువను చాటిచెప్పింది. టెస్ట్‌లను నాలుగు రోజులకు కుదించాలన్న చర్చకు తెరపడింది. ఇండియా-ఇంగ్లాండ్‌ సిరీస్‌తో టెస్ట్‌లకు అదనపు బలం చేకూరుతుందని అందరూ అనుకున్నారు. కొత్త సంవత్సరంలో సుదీర్ఘఫార్మాట్‌కు మేలే జరుగుతుందని భావించారు.. ఇంగ్లాండ్‌, ఇండియాలే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు కూడా అయిదు రోజుల మ్యాచ్‌ల పట్ల ఆసక్తి పెంచుకున్నాయి. ఊహించిన విధంగానే ఇండియా 3-1 తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. అయితే క్యూరేటర్లు తయారు చేసిన పిచ్‌లపైనే బోలెడన్ని విమర్శలు వచ్చాయి. నాసిరకమైన పిచ్‌లను తయారు చేసినందుకు సీనియర్‌ క్రికెటర్లు పెదవి విరిచారు కూడా! సిరీస్‌లో ఒకే ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ అయిదు రోజుల పాటు సాగింది. పింక్‌బాల్‌తో విద్యుత్‌దీపాల వెలుగులో జరిగిన మ్యాచ్‌ అయితే కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.. ఈ విధంగానైనా కరెంట్‌ ఆదా అయినందుకు సంతోషిద్దాం. ! టెస్ట్‌ మ్యాచ్‌లను అయిదు రోజుల పాటు ఆడాలి. కానీ రెండు మూడు రోజుల్లోనే ఎందుకు ముగుస్తున్నాయి? అంటే టీ-20 ప్రభావమే అందుకు కారణం. పైగా ఆటగాళ్ల మైండ్‌సెట్‌ కూడా మారిపోయింది. మీరు గమనించారో లేదో కాని టెస్ట్‌ల్లో కూడా స్ట్రయిక్‌ రేట్‌ బాగా పెరిగింది. టెస్ట్‌ క్రికెట్‌ విలువను బ్యాట్స్‌మెన్‌ గుర్తెరగడం లేదు. అందులో ఉన్న మజాను ఆస్వాదించలేకపోతున్నారు.

టెస్ట్‌ క్రికెట్‌పై చాలామంది ఆటగాళ్లకు అవగాహన లేదు. క్రికెట్ నిర్వాహకులకు కూడా దానిపై పూర్తిగా అవగాహన లేదు. ఇక వ్యాఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్‌ టాలెంట్‌ బయటపడేది టెస్ట్‌ క్రికెట్‌లోనే! ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌కు చాలా ఓపిక ఉండాలి. సత్తువ ఉండాలి. నిలకడ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రతిభ కనబర్చాలి. బౌలర్ల సహనాన్ని పరీక్షించాలి. అదే విధంగా బౌలర్లలో కూడా! టీమ్‌ కెప్టెన్‌ కూడా ఆట జరుగుతున్నంతసేపు అనుక్షణం అప్రమత్తతో ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉండాలి. టెస్టుల్లో ఎప్పుడూ గెలుపుపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు.. అప్పుడప్పుడు ఓటమి నుంచి తప్పించుకోవడానికి కూడా తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో డ్రా చేసుకోవడం కూడా విజయం సాధించినంత గొప్పే! ఇతర ఫార్మాట్‌లలో ఇంత అవసరం ఉండదు. ఇండియా-ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు వచ్చాయి.. ఒక్కటి కూడా డ్రాగా ముగియకపోవడానికి కారణమేమిటి? వెరీ సింపుల్‌.. ఇటు ఇండియాకు కానీ, అటు ఇంగ్లాండ్‌కు కానీ డ్రా చేసుకోవలసిన అవసరం ఏర్పడలేదు కాబట్టి. అయిదు రోజుల క్రికెట్‌లో ఓటమిని తప్పించి డ్రా చేయించడం కూడా చాలా గొప్ప! ఈ కారణం వల్లే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే గవాస్కర్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, చేతన్‌ చౌహాన్‌, దిలిప్‌ వెంగ్‌సర్కార్‌, గుండప్ప విశ్వనాథ్‌లు ఎంతో ముందుంటారు. బిషన్‌సింగ్‌ బేడి, ఎర్రపల్లి ప్రసన్న, ఎస్‌. వెంకట్రాఘవన్‌, బాపు నాదకర్ణి, దిలిప్‌ దోషి, బీఎస్‌ చంద్రశేఖర్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే తాము కీర్తి ప్రతిష్టలను గడించడమే కాకుండా దేశానికి ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చారు. అన్ని ఫార్మాట్లలో పురాతనమైనది, స్వచ్ఛమైనది, సంప్రదాయమైనది టెస్ట్‌ క్రికెట్‌లో గొప్పవారనిపించుకున్నారు. ఏడు, ఎనిమిది దశకాల్లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లను ఫాలో అయిన వారికి పైన చెప్పుకున్న పేర్లు సుపరిచితమే! క్రీజులో గంటల తరబడి నిలబడటమన్నది బ్యాట్స్‌మెన్‌కు సవాలే! బౌలర్లు కూడా చాలా కట్టుదిట్టంగా, పకడ్బందీ లైన్‌ అండ్‌ లెంత్‌తో బౌలింగ్‌ చేసేవారు..80 శాతం మెయిడిన్లే ఉండేవి.

ఇప్పుడున్న క్రికెటర్లలో ఎక్కువ మందికి టెస్ట్‌ క్రికెట్‌ గురించి పెద్దగా అవగాహన లేదు. పాత టెస్ట్ మ్యాచ్‌ల వీడియోలను చూసి నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఎంతసేపూ కీర్తి కనకాలపైనే దృష్టి పెడుతున్నారు. గవాస్కర్‌ అంతటి గొప్ప ఆటగాడు కూడా వీడియోలు చూసి నేర్చుకున్నాడు.. రోహిత్‌శర్మ, ఛతేశ్వర్‌ పుజారా, కరుణ్‌ నాయర్‌ వంటి ఆటగాళ్లకు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను ఆడే సామర్థ్యం వుంది. పొట్టి ఫార్మాట్లలో కూడా గొప్పగా ఆడే నేర్పు ఉంది..అందరికీ ఇది సాధ్యం కాదు. అంటే పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో గొప్పగా రాణించేవారు టెస్ట్‌ల్లో రాణిస్తారన్న గ్యారంటీ లేదు.. ఈ కారణం వల్లే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలు టెస్ట్‌లకు ప్రత్యేకంగా టీమ్‌ను ఎంపిక చేస్తాయి.

ఏ క్రికెట్‌ టీమ్‌ అయినా గెలుపుకోసమే వ్యూహాలు రచించుకుంటుంది. ముఖ్యంగా టెస్ట్‌ మ్యాచ్‌లో అయితే పరిస్థితులకు అనుగుణంగా కెప్టెన్‌ వ్యూహాలు మార్చుకోవలసి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, పిచ్‌ కండీషన్‌, టాస్‌ .. ఇవన్నీ మన చేతుల్లో లేకపోయినా పరిస్థితులను బట్టి ప్రణాళికలను మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.. ఇంగ్లాండ్‌-ఇండియా మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌నే తీసుకుంటే క్యూరేటర్‌కు పిచ్‌ ఏర్పాటులో అంతగా అవగాహన, అనుభవం లేవనే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పిచ్‌ అసలు టెస్ట్‌ మ్యాచ్‌కు ఏ మాత్రం సరిపోదు. అసలు అతడికి కనీసం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు జరిగే పిచ్‌ను కూడా ప్రిపేర్‌ చేసిన అనుభవం లేదు.. మొదటి రెండు రోజులు ఫ్లాట్‌గా ఉండి, చివరి మూడు రోజులు బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయిన తీరును మనం చూశాం. టెస్ట్‌ మ్యాచ్‌ల్లో రోజుకు 90 ఓవర్లు వేయాలన్న నిబంధన ఉంది. ఇంతకు ముందు ఇలాంటి నిబంధనేమీ ఉండేది కాదు. అంపైర్లు తల్చుకున్నప్పుడే రోజు ఆట ముగిసేది.. 90 ఓవర్ల నిబంధన లేకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోవడం కోసం జట్లు ఉద్దేశపూర్వకంగా బౌలింగ్‌ను ఆలస్యం చేసేవి. డిలే టాక్టిక్స్‌ అంటామే! అదన్నమాట! అందుకోసమే 90 ఓవర్ల నిబంధన పెట్టారు. అయితే 90 ఓవర్ల నిబంధన వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం చెన్నై టెస్ట్‌లో విరాట్‌కోహ్లీ విఫలమయ్యాడనే చెప్పాలి. జో రూట్‌ డబుల్‌ సెంచరీ, బెన్‌ స్ట్రోక్స్‌ వేగంగా పరుగులు తీస్తున్నప్పుడు నెగటివ్‌ టాక్టిక్స్‌ను ప్రయోగించాలి. లెగ్‌ సైడ్‌లోనో ఆఫ్‌సైడ్‌లోనో బౌలింగ్‌ చేయాలి. బ్యాట్స్‌మెన్‌ను సింగిల్స్‌, డబుల్స్‌ తీసుకోవడానికే పరిమితం చేయాలి. వారు సునాయాసంగా బౌండరీలు సాధించే అవకాశం ఇవ్వకూడదు.. స్పిన్సర్లయినా, మీడియం పేస్‌ బౌలర్లు అయినా ఇదే వ్యూహంతో బౌలింగ్‌ చేయాలి. కానీ చెన్నైలో జరిగింది ఇందుకు భిన్నం. పాతతరం సారథుల్లా ఇప్పటి వారు ఆలోచించలేకపోతున్నారు. ప్రత్యర్థి జట్టు అసాధారణమైన లక్ష్యాన్ని విసిరినప్పుడు బ్యాట్స్‌మెన్‌ కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించాల్సి వుంటుంది.. గెలవడం అసాధ్యమనుకున్నప్పుడు డ్రా కోసం ప్రయత్నించాలి. వీలైనంత ఎక్కువ సమయం క్రీజులో నిలబడగలగాలి. బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టగలగాలి. ఒకప్పుడంటే ఏమో అనుకోవచ్చు కానీ.. ఇప్పుడు యూ ట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు.. బాబ్‌ విల్లిస్‌, మల్కం మార్షన్‌, డెన్నిస్‌ లిల్లీ, జెఫ్‌ థాంప్సన్‌ల బౌలింగ్‌ను గవాస్కర్‌ ఎలా ఎదుర్కొన్నాడో ఈ తరం ఆటగాళ్లు చూస్తే మంచిది..

వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఇలాంటి పొరపాటే చేసింది. చిట్టగాంగ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌కు వస్తే, అసలు టెస్ట్ మ్యాచ్‌ ఎలా ఆడకూడదో బంగ్లాదేశ్‌ చూపించింది. అలాగని తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన డబుల్‌ సెంచరీ సాధించిన కేల్‌ మెయర్స్‌ ఘనతను తక్కువ చేసినట్టు కాదు కానీ.. బంగ్లాదేశ్‌ బౌలింగ్ మరీ నాసిరకంగా ఉండిందా మ్యాచ్‌లో! రంజీట్రోఫీ మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐ ఆలోచనా విధానం కూడా సరిగ్గా లేదు. ఎంతసేపూ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీపైనే ఆసక్తి చూపుతున్నది కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లపై శ్రద్ధ పెట్టడం లేదు.. అందుకే సుదీర్ఘ ఫార్మట్‌ క్రికెట్‌ ఇప్పుడు మసకబారిపోతున్నది. విచిత్రమేమిటంటే టీ-20 టోర్నమెంట్‌కు ఆల్‌రౌండర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ పేరు పెట్టడం, వన్డే ఫార్మట్‌లో ఉన్న ట్రోఫీకి విజయ్‌ హజారే పేరు పెట్టడం. ఈ ఇద్దరు టెస్ట్‌లలోనే అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. విదేశాల్లో తొలి సెంచరీ సాధించిన ఇండియన్‌గా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ రికార్డు సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంలో విజయ్‌ హజారే కీలక పాత్ర వహించాడు. టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన తొలి భారతీయుడు కూడా విజయ్‌ హజారేనే! ఏమైనా రంజీ ట్రోఫీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత బీసీసీఐపై ఉంది.. పిచ్‌లపై విమర్శలు రాకుండా చూసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యమైనది టెస్ట్‌లు అంతరించిపోకుండా జాగ్రత్తపడాలి.. అసలు క్రికెట్‌ అంటేనే టెస్ట్‌! ఆ పరీక్షలో యువ ఆటగాళ్లు పాసవ్వాలి.

Test Cricket

Test Cricket

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?