AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washington Sundar : ఎవరీ పీ.డీ. వాషింగ్టన్? వాషింగ్టన్ సుందర్ కు ఆయన పేరు ఎందుకు పెట్టారు ?

టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరు వెనుక గొప్ప కథ ఉంది. సుందర్ తండ్రికి క్రికెటర్‌ కావాలన్న కలను సాకారం చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డువచ్చాయి. పీడీ వాషింగ్టన్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి ఎం. సుందర్‌కు సహాయం చేసి, అతని క్రికెట్ కలలకు సపోర్టుగా నిలిచారు.

Washington Sundar : ఎవరీ పీ.డీ. వాషింగ్టన్? వాషింగ్టన్ సుందర్ కు ఆయన పేరు ఎందుకు పెట్టారు  ?
Washington Sundar
Rakesh
|

Updated on: Aug 02, 2025 | 10:37 AM

Share

Washington Sundar : మన దేశంలో కొన్ని పేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన పేరున్న క్రికెటర్లలో వాషింగ్టన్ సుందర్ ఒకరు. ఆయన హిందువు అయినప్పటికీ, ఆయన పేరు చాలా భిన్నంగా ఉంటుంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆల్ రౌండర్ గా అదరగొడుతున్న వాషింగ్టన్ సుందర్ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. అయితే, అతని ఆటతీరు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా, ఒక హిందువు అయినప్పటికీ అతనికి వాషింగ్టన్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం. సాధారణంగా క్రైస్తవులకు ఉండే ఈ పేరు, వాషింగ్టన్ సుందర్‌కు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

వాషింగ్టన్ సుందర్ తండ్రి పేరు ఎం. సుందర్. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమిళనాడు మెయిన్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ఎం. సుందర్ చిన్నతనంలో క్రికెట్ ఆడేందుకు స్టేడియానికి వెళ్లినప్పుడు, అక్కడ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పిల్లల ఆటను చూసేవారు. ఆ పిల్లల్లో ఎం. సుందర్ ఆట ఆ అధికారిని బాగా ఆకట్టుకుంది. ఆ రిటైర్డ్ అధికారి ఎం. సుందర్‌తో, “నువ్వు క్రికెట్ ఆడు, నేను నీకు చదువు చెప్పిస్తాను, కిట్ బ్యాగ్ కొనిస్తాను, సైకిల్‌పై బడికి తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకొస్తాను” అని చెప్పారు. ఎం. సుందర్ పేద కుటుంబం నుంచి రావడంతో చదువు, క్రికెట్‌కు అయ్యే ఖర్చులను భరించడం కష్టమని తెలిసి ఆ అధికారి ఈ సాయం చేశారు.

ఎం. సుందర్‌కు సాయం చేసిన ఆ రిటైర్డ్ ఆఫీసర్ పేరు పి.డి. వాషింగ్టన్. 1999లో ఆయన చనిపోయారు. అదే సంవత్సరం ఎం. సుందర్ భార్య ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. మొదట, ఎం. సుందర్ తన కొడుకుకి శ్రీనివాసన్ అని పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ, కొన్ని క్షణాల తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు. తన కష్టకాలంలో తనకు తోడుగా నిలిచి, ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి పేరునే తన కొడుకుకు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే, ఆ గొప్ప వ్యక్తికి గౌరవంగా తన కొడుక్కి వాషింగ్టన్ సుందర్ అని పేరు పెట్టారు. ఈ కథ వాషింగ్టన్ సుందర్ పేరుకు ఉన్న ప్రాముఖ్యతను, ఒక వ్యక్తి పట్ల అతని తండ్రికున్న కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..