Jersey Sponsor : భారత్-పాక్ క్రికెట్ బోర్డుల బ్రాండ్ వాల్యూలో ఎంత తేడా ఉందో తెలుసా? ఈ జెర్సీ డీల్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!
భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ ఈ బిడ్‌ను గెలుచుకుంది. టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉండటానికి అపోలో టైర్స్ రికార్డు స్థాయిలో బిడ్ చేసింది. ఈ ఒప్పందం రూ.579 కోట్లకు ఖరారు అయింది. ఇది రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది.

Jersey Sponsor : భారత క్రికెట్ జట్టుకు జెర్సీ కోసం కొత్త స్పాన్సర్ లభించింది. ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ ఈ బిడ్‌ను గెలుచుకుంది. అపోలో టైర్స్ టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా రికార్డు స్థాయిలో బిడ్ వేసింది. అపోలో టైర్స్ రెండున్నర సంవత్సరాల పాటు టీమ్ ఇండియా జెర్సీకి స్పాన్సర్‌గా ఉంటుంది. ఈ సమయంలో బీసీసీఐకి మొత్తం 579 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. రాబోయే మూడేళ్లలో భారత జట్టు 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లలో ఆడుతుంది. ప్రతి మ్యాచ్‌లో టీమ్ ఇండియా జెర్సీపై అపోలో టైర్స్ బ్రాండింగ్ ఉంటుంది. టీమ్ ఇండియా జెర్సీ ద్వారా బీసీసీఐ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందుతోంది. ఇప్పుడు మన పొరుగు దేశం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పాన్సర్ ఎవరు, ఆ డీల్ ఎంత అనే విషయాలను తెలుసుకుందాం. పీసీబీకి జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం ఎంత డబ్బు వస్తుందో చూద్దాం.
పాకిస్తాన్ జెర్సీ స్పాన్సర్ ఎవరు?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీ. గత చాలా సంవత్సరాల నుండి పెప్సీ, పాకిస్తాన్ క్రికెట్‌ల మధ్య సంబంధం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పెప్సీ మధ్య ఈ డీల్ 48 కోట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇది కేవలం ఒక నివేదిక మాత్రమే. ఈ మొత్తం చూస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ జట్టు బ్రాండ్ విలువలో ఎంత తేడా ఉందో స్ఫష్టంగా అర్థం అవుతుంది.
తొలిసారిగా టైర్ కంపెనీ టీమ్ ఇండియాతో భాగస్వామి
భారత క్రికెట్ జట్టు జెర్సీకి గతంలో చాలా స్పాన్సర్లు ఉన్నారు. సహారా, విల్స్, స్టార్ వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. టీమ్ ఇండియా జెర్సీకి మొదటి స్పాన్సర్ ఐటీసీ లిమిటెడ్, ఇది 8 సంవత్సరాల పాటు టీమ్ ఇండియాతో ఉంది. ఆ తర్వాత 2001 నుండి 2013 వరకు సహారా టీమ్ ఇండియా జెర్సీకి స్పాన్సర్‌గా ఉంది. 2014 నుండి 2017 వరకు స్టార్ ఇండియా కంపెనీ స్పాన్సర్‌గా ఉంది. చైనా కంపెనీ ఓపో కూడా 2017 నుండి 2019 వరకు టీమ్ ఇండియాకు స్పాన్సర్‌గా ఉంది. 2019 నుండి 2023 వరకు బైజూస్ కంపెనీ భారత జట్టు జెర్సీకి స్పాన్సర్‌గా ఉంది. ఆ తర్వాత డ్రీమ్11 టీమ్ ఇండియాతో చేరింది. ఇప్పుడు ఈ జాబితాలో అపోలో టైర్స్ పేరు చేరింది.
ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి కోట్లల్లో ఆదాయం
అపోలో టైర్స్, బీసీసీఐ మధ్య ఈ ఒప్పందం 579 కోట్ల రూపాయలకు ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం.. అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి దాదాపు 4.77 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లిస్తుంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లు, ఐసీసీ టోర్నమెంట్‌లలోని మ్యాచ్‌ల కోసం ఈ మొత్తం వేర్వేరుగా ఉండవచ్చు. బోర్డు ద్వైపాక్షిక మ్యాచ్‌ల కోసం 3.5 కోట్ల రూపాయలు, ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం 1.5 కోట్ల రూపాయల బేస్ ధరను నిర్ణయించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




