నాడు ఛీ కొట్టారు.. నేడు రమ్మంటూ హారతి పట్టారు.. టీమిడియాలోకి ఆ నలుగురు రీ ఎంట్రీ..?
Team India Return Players: టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కొందరు టీమ్ ఇండియా స్టార్లు, ఇప్పుడు ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఈ నలుగురు కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Team India Return Players: ప్రస్తుతం భారత క్రికెటర్లు ఐపీఎల్ 2026 సందడిలో మునిగిపోయారు. అయితే, ఈ లీగ్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియాకు తీరిక లేని షెడ్యూల్ ఉంది. తొలుత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీని తర్వాత భారత్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు బయలుదేరనుంది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, జులై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. ఈ పర్యటనల కోసం ఐపీఎల్ స్టార్లకు పిలుపు వచ్చే సూచనలు ఉన్నాయి.
1. శ్రేయస్ అయ్యర్: కెప్టెన్ రేసులో ముందున్న బ్యాటర్..
కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ సారథి, ప్రస్తుత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ దాదాపు ఖాయమైంది. తాజా సమాచారం ప్రకారం, ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు అయ్యర్‌ను జట్టు కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో అయ్యర్ 9 మ్యాచ్‌ల్లో 54.67 సగటుతో, 165.66 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు సాధించాడు. అతని అద్భుత ఫామ్, కెప్టెన్సీ నైపుణ్యంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో అయ్యర్ అనుభవం టీమ్ ఇండియాకు అదనపు బలం కానుంది.
2. రజత్ పాటిదార్: సూర్యకు ప్రత్యామ్నాయంగా..?
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 200.78 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేసిన పాటిదార్, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో, మిడిల్ ఆర్డర్‌లో విధ్వంసం సృష్టించగల పాటిదార్‌ను యూకే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. కేవలం మూడు టెస్టులు, ఒక వన్డే ఆడి పక్కన పెట్టిన సెలక్టర్లకు, ఈ ఐపీఎల్ ప్రదర్శనతో పాటిదార్ గట్టి సమాధానం ఇచ్చాడు.
3. భువనేశ్వర్ కుమార్: వయస్సు కేవలం అంకె మాత్రమే..!
36 ఏళ్ల వయసులోనూ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ మాయాజాలంతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన ఈ వెటరన్ పేసర్, ఈ ఐపీఎల్ సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి, 7.54 ఎకానమీతో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా టీ20 ఫార్మాట్‌కు కొంతకాలం విరామం ఇచ్చే అవకాశం ఉన్నందున, అనుభవం ఉన్న బౌలర్‌గా భువీకి ఇంగ్లాండ్ పర్యటనలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
4. నితీష్ కుమార్ రెడ్డి: ఆల్రౌండర్ కోటాలో చోటు..
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తున్నాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ వంటి పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఒక అదనపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం టీమ్ ఇండియాకు ఉంటుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా నితీష్ కుమార్ రెడ్డి సరైన ఎంపిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2026 ద్వారా ఫామ్‌లోకి వచ్చిన ఈ నలుగురు ఆటగాళ్లు టీమ్ ఇండియా జెర్సీని ధరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సెలక్టర్లు వీరిపై నమ్మకం ఉంచి యూకే పర్యటనకు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
