తుపాకీతో కాల్చేద్దామనుకున్నా.. యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
Kapil Dev Responds to Yograj Singh Controversy: యోగ్రాజ్ సింగ్ తుపాకీ పట్టుకుని చంపేస్తానని బెదిరించానన్న తీవ్రమైన వ్యాఖ్యలకు కూడా కపిల్ దేవ్ తనదైన శైలిలో అత్యంత హుందాగా సమాధానమిచ్చారు. ద్వేషం కంటే ప్రేమే గొప్పదని, జీవితంలో చేదు స్వభావం ఉన్న మనుషులకు దూరంగా ఉండటమే మంచిదనే సందేశాన్ని ఇస్తూ కపిల్ దేవ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నారు.

Kapil Dev Responds to Yograj Singh Controversy: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకరైన యోగ్రాజ్ సింగ్, తాజాగా దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు, బెదిరింపులపై కపిల్ దేవ్ ఎట్టకేలకు నోరు విప్పారు. జీవితంలో ఎలాంటి మనుషులకు దూరంగా ఉండాలో చెబుతూ ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.
శత్రుత్వంపై కపిల్ దేవ్ హుందాతనం.. కోపానికి తావులేదు..!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, యువరాజ్ సింగ్ తండ్రి అయిన యోగ్రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. కపిల్ దేవ్ తన కెరీర్‌ను నాశనం చేశాడని, ఒకానొక సమయంలో పిస్తోల్ తీసుకుని ఆయన ఇంటికి కూడా వెళ్లానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్ దేవ్, ఎంతో ప్రశాంతంగా, హుందాతనంతో సమాధానమిచ్చారు. యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తన మనసులో ఎలాంటి కోపం గానీ, పగ గానీ లేవని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..
“నా జీవితంలో అలాంటి చేదు మనుషులకు చోటు లేదు”
ఈ వివాదంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. జీవితంలో చేదు జ్ఞాపకాలను, ద్వేషాన్ని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగడం తనకు ఇష్టం లేదని అన్నారు. “నేను ఇప్పటికీ యోగ్రాజ్ సింగ్‌ను నా పాత స్నేహితుడిగానే భావిస్తాను. కానీ నా జీవితంలో ప్రతిదానికీ ప్రతికూలంగా స్పందించే, మనసులో చేదును నింపుకున్న మనుషులను కలవడానికి నేను ఇష్టపడను. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండే మనుషుల మధ్య గడపడానికే ప్రాధాన్యత ఇస్తాను” అని కపిల్ దేవ్ చాలా సున్నితంగానే యోగ్రాజ్ తీరును తప్పుబట్టారు. మనం ఇచ్చే స్పందనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని ఆయన హితవు పలికారు.
యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు..
తండ్రి చేసిన అనాలోచిత వ్యాఖ్యలపై గతంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. దీనిపై కపిల్ దేవ్ స్పందిస్తూ, యువరాజ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదని అన్నారు. “యువరాజ్ సింగ్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్. అతను ఆటను మరింత ప్రజాదరణ పొందేలా చేశాడు. తండ్రి చేసిన పనులకు కొడుకు బాధ్యుడు కాడు. అతని కొడుకు అంత గొప్పగా రాణించినప్పుడు, యోగ్రాజ్ సింగ్ సంతోషంగా ఉండాలి కానీ ఇలాంటి చేదు అనుభవాలను మనసులో పెట్టుకోకూడదు” అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
పాత రోజులను మర్చిపోకూడదు.. కపిల్ దేవ్ సూచన..
తామిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, హర్యానా, నార్త్ జోన్ జట్ల తరఫున ఎన్నో అద్భుతమైన క్షణాలను పంచుకున్నామని కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఒకరి మార్గాలు ఒకరికి వేరైనంత మాత్రాన పాత రోజుల్లోని మంచిని మర్చిపోకూడదని హితవు పలికారు. జీవితంలో మనకు అనుకున్నవన్నీ దక్కకపోవచ్చు, అంతమాత్రానికే ఇతరులపై ద్వేషాన్ని పెంచుకోవడం సరికాదని, గతాన్ని వదిలేసి వర్తమానంలో సంతోషంగా బతకడం నేర్చుకోవాలని కపిల్ దేవ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




