AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరులో భారీ బంగారు గని.. సీమకు ఇక.. మంచిరోజులే.. గోల్డ్ క్యాపిటల్‌‌గా AP!

చిత్తూరులో భారీ బంగారు గని.. సీమకు ఇక.. మంచిరోజులే.. గోల్డ్ క్యాపిటల్‌‌గా AP!

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 8:18 PM

Share

కర్నూలు జొన్నగిరి గోల్డ్ మైన్ ఉత్పత్తి ప్రారంభం, చిత్తూరు చిగురుగుంట–బి.సనత్తం గోల్డ్ బ్లాక్ వేలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశ గోల్డ్ హబ్‌గా మారే అవకాశాలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో బంగారు ఖనిజాల అన్వేషణ కొనసాగుతుండగా, భారీ నిల్వలు వెలుగులోకి వస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో ఏపీ కీలక కేంద్రంగా అవతరించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

ఒకప్పుడు ప్రపంచ బంగారు చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక గర్వకారణం. దాదాపు వందేళ్లపాటు బంగారం తవ్వకాలు జరిగిన ఆ ప్రాంతం… భారత ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ గనులు మూతపడడంతో దేశంలో బంగారం ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు అదే కోలార్ బెల్ట్‌కు కొనసాగింపుగా భావిస్తున్న ప్రాంతాల్లో మళ్లీ బంగారు ఆశలు మెరుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జొన్నగిరి గోల్డ్ మైన్ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించగా… ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట–బి.సనత్తం గోల్డ్ బ్లాక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 22 లక్షల టన్నులకు పైగా బంగారు ఖనిజం… అంతర్జాతీయ ప్రమాణాలకు మించిన గ్రేడ్… మూడోసారి వేలానికి సిద్ధమవుతున్న ప్రాజెక్ట్… ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. “ఆంధ్రప్రదేశ్ నిజంగానే దేశ గోల్డ్ హబ్‌గా మారబోతుందా? అని.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం 800 టన్నులకు పైగా బంగారం మన దేశంలో వినియోగిస్తున్నారు. కానీ మన దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. అవసరమైన బంగారంలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం దేశం బయటకు వెళ్తోంది. ఇలాంటి సమయంలో… ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి తర్వాత ఒకటి బంగారు గనుల ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం… చిత్తూరులో కొత్త గోల్డ్ బ్లాక్ వేలం… మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొత్త బంగారు ప్రాంతాల అన్వేషణ… ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గోల్డ్ మైనింగ్ హబ్‌గా మారుతుందా అనే చర్చ మొదలైంది. అసలు ఏపీలో ఎక్కడెక్కడ బంగారం ఉంది? బంగారం ఎలా గుర్తిస్తారు? ప్రభుత్వం ఎందుకు ఒకేసారి అనేక జిల్లాల్లో అన్వేషణ చేపడుతోంది? జొన్నగిరి, చిగురుగుంట ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాష్ట్ర గనుల శాఖ అంచనా ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో బంగారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అంచనాలు కేవలం ఊహలు కావు. గతంలో జరిగిన భూగర్భ అధ్యయనాలు, రాళ్ల నిర్మాణం, ఖనిజాల ఆనవాళ్లు, పాత గనుల సమాచారం… వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమవ్వడంతో… మిగతా ప్రాంతాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి ట్రస్ట్… అంటే NMET నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఖనిజ అన్వేషణ వేగవంతం చేశారు. అయితే, చాలామందికి ఒక సందేహం ఉంటుంది. భూమిలో బంగారం ఉందని ఎలా గుర్తిస్తారు? ఎక్కడ పడితే అక్కడ తవ్వితే బంగారం దొరుకుతుందా అని? నిజానికి బంగారం అన్వేషణ అనేది పూర్తిగా శాస్త్రీయ ప్రక్రియ. దీనికి నాలుగు దశలు ఉంటాయి. మొదటిది జియోలాజికల్-4… అంటే G-4 దశ. ఇందులో శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలోని మట్టి, రాళ్లు, భూగర్భ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. బంగారం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ముందుగా నిర్ధారిస్తారు. తర్వాత జియోలాజికల్-3… అంటే G-3 దశ మొదలవుతుంది. ఇందులో సగటున 400 మీటర్ల దూరానికి ఒక బోర్ హోల్ వేసి భూమి లోపల నుంచి రాళ్ల నమూనాలు తీసుకొస్తారు. వాటిని ప్రయోగశాలలో పరీక్షించి బంగారం ఆనవాళ్లు ఎంత మేర ఉన్నాయో విశ్లేషిస్తారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే… తదుపరి G-2 దశకు వెళ్తారు. ఈ దశలో ప్రతి 200 మీటర్ల దూరానికి బోర్ హోల్స్ వేసి మరింత లోతుగా పరిశోధనలు చేస్తారు. దీంతో భూగర్భంలో ఉన్న ఖనిజ నిల్వల పరిమాణంపై స్పష్టత వస్తుంది. చివరిగా G-1 దశకు చేరుకుంటారు. ఈ దశ పూర్తయితేనే ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మైనింగ్‌కు అనుకూలంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత మైనింగ్ లీజులు కేటాయించి… వాణిజ్యపరంగా తవ్వకాలకు అనుమతులు ఇస్తారు.అంటే… ఒక గని ప్రారంభం కావాలంటే నెలలు కాదు… కొన్నిసార్లు ఏళ్ల తరబడి పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని నంబలపూలకుంట మండలం జౌకుల ప్రాంతంలో పెద్ద ఎత్తున అన్వేషణ జరుగుతోంది. ఈ ప్రాంతాన్ని ఆరు బ్లాకులుగా విభజించారు. అందులో ఐదు బ్లాకుల్లో ప్రైవేట్ సంస్థలకు అన్వేషణకు అనుమతులు ఇచ్చారు. వీటిలో క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, జెమ్‌కో, భూష్లిప్ మైన్స్ అండ్ మినరల్స్, జెమ్స్ ప్రాజెక్ట్స్, జియో ఎక్స్‌ప్లోర్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి తయారుచేసే నివేదికల ఆధారంగా NMET తదుపరి దశకు నిధులు విడుదల చేస్తుంది. ఇదే జిల్లాలోని రామగిరి ప్రాంతంలో కూడా మరో కీలక అన్వేషణ కొనసాగుతోంది. ఒకప్పుడు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగించిన ప్రాంతాలకు ఆనుకుని ఉన్న రెండు వేల హెక్టార్లలో ఇప్పుడు కొత్తగా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే రొద్దం మండలంలోని బొక్సంపల్లి ఉత్తర, దక్షిణ బ్లాకుల్లో కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే G-3 దశ అన్వేషణ చేపట్టింది. ఈ ప్రాంతాల్లో కూడా ఆశాజనక ఫలితాలు వస్తే… భవిష్యత్తులో కొత్త గోల్డ్ బ్లాకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే… ప్రభుత్వం ఒక్క జొన్నగిరి గనిపైనే ఆధారపడటం లేదనే విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బంగారం అవకాశాలను గుర్తించి… భవిష్యత్తులో పెద్ద ఎత్తున గోల్డ్ మైనింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మొత్తం ప్రయాణంలో మొదటి విజయగాథగా నిలిచింది కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ప్రారంభమైన తొలి భారీ బంగారు గనుల ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. తుగ్గలి మండలంలోని ఈ ప్రాజెక్టును జియో మైసూర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.దాదాపు 1,400 హెక్టార్ల లీజు ప్రాంతంలో అన్వేషణ చేపట్టిన ఈ సంస్థ… ఇప్పటికే బంగారం ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం టన్ను ఖనిజం నుంచి సగటున 1.5 గ్రాముల బంగారం లభిస్తోంది. ప్రస్తుతానికి ఏడాదికి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం… మొత్తం లీజు ప్రాంతంలో దాదాపు 15 వేల కిలోల వరకు బంగారం నిల్వలు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జొన్నగిరిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో… దేశీయ బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కానీ… ఈ బంగారం కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే… ఇప్పుడు అందరి చూపు చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట గోల్డ్ బ్లాక్‌పై పడింది. అంతర్జాతీయ ప్రమాణాల కంటే మెరుగైన బంగారం గ్రేడ్… 22 లక్షల టన్నుల ఖనిజ నిల్వలు… కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కు కొనసాగింపుగా భావిస్తున్న భౌగోళిక నిర్మాణం… ఇవన్నీ ఈ ప్రాజెక్టును మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే “ఒకప్పుడు ప్రపంచానికి బంగారం అందించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పుడు అదే భౌగోళిక బెల్ట్‌లో ఉన్న జొన్నగిరి, చిగురుగుంట–బి.సనత్తం గోల్డ్ బ్లాక్‌లు ఆంధ్రప్రదేశ్‌ను దేశ గోల్డ్ క్యాపిటల్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు 50 టన్నుల వరకు బంగారు నిల్వల అంచనాలు… మరోవైపు చిత్తూరులో కొత్త గోల్డ్ బ్లాక్ వేలం… ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతమైతే రాబోయే దశాబ్దంలో భారత గోల్డ్ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్ పేరు బంగారు అక్షరాలతో నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.”

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గాయోచ్‌!

డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

Follow Us