IND vs ENG 1st ODI: గబ్బర్ కెరీర్‌లో వెరీవెరీ స్పెషల్ మ్యాచ్.. అదేంటో తెలుసా?
Shikhar Dhawan: ఈ టీమిండియా దిగ్గజం ఇప్పటివరకు 149 వన్డేలు ఆడాడు. తన వన్డే కెరీర్‌లో 150వ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇంగ్లండ్ -భారత్(IND vs ENG 1st ODI) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో శిఖర్ ధావన్(Shikhar Dhawan) మరోసారి భారత జెర్సీలో ఆడబోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేలో మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే శిఖర్ ధావన్ చాలా ప్రత్యేక స్థానం సాధించనున్నాడు. నిజానికి శిఖర్ ధావన్ ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో 149 మ్యాచ్‌లు ఆడాడు. జులై 12న జరగనున్న మ్యాచ్ శిఖర్ ధావన్ కెరీర్‌లో 150వ వన్డే కానుంది. వన్డే క్రికెట్‌లో శిఖర్ ధావన్ రికార్డు చాలా బాగుంది. ఈ కాలంలో అతను చాలా పెద్ద మైలురాళ్లను సాధించాడు.
శిఖర్ ధావన్ 149 వన్డేల్లో 45.54 సగటుతో 6284 పరుగులు చేశాడు. ఈ సమయంలో శిఖర్ ధావన్ స్ట్రైక్ రేట్ 93.37గా ఉంది. ఇది మాత్రమే కాదు, శిఖర్ ధావన్ వన్డే క్రికెట్‌లో 17 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది బిగ్ టోర్నమెంట్..
ప్రపంచ కప్ లేదా ICC ఛాంపియన్‌షిప్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్‌లలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ నెక్ట్ లెవల్లో ఉంటుంది. 2013, 2017 ఛాంపియన్‌షిప్ ట్రోఫీల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ఇది కాకుండా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ గడ్డపై ఆడిన 2015 ప్రపంచకప్‌లో కూడా ధావన్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్‌కు ఇకపై భారత్ తరపున టెస్టు, టీ20లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ నెలలో వెస్టిండీస్‌లో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో శిఖర్ ధావన్ టీమిండియా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.