IND vs SA: ఉమ్రాన్ మాలిక్‌కి టీ20ల్లో అవకాశం ఇవ్వొద్దు.. టీమిండియా మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు..
Umran Malik: టీ20 ఫార్మాట్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయకపోవడమే మంచిదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ముందుగా వన్డే, టెస్టుల్లో మాత్రమే చోటివ్వాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్‌ఇండియాలో ఎంపికైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారాడు. ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఉమ్రాన్ మాలిక్‌కు మొదటి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకోవాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీ20 జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వకూడదని మాజీ కోచ్ సూచించాడు. ‘మాలిక్‌ను టీమ్‌తో తీసుకెళ్లండి. కానీ, అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఉమ్రాన్‌కు వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత అతని ప్రదర్శన భవిష్యత్తును నిర్ణయిస్తోంది’ అని పేర్కొన్నాడు.
ఫాస్ట్ బౌలింగ్‌లో తిరుగులేని అస్త్రం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు, ఉమ్రాన్ మాలిక్ అన్ని మ్యాచ్‌లలో వేగంగా బంతిని విసిరి, అవార్డులను గెలుచుకున్నాడు. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం ఉమ్రాన్ మాలిక్ స్పెషల్. ఇది కాకుండా, ఉమ్రాన్‌కు వికెట్లు తీయగల సామర్థ్యం కూడా ఉంది. అతను 14 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశాడు.
టీమిండియా ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉమ్రాన్ మాలిక్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ద్రవిడ్ ఉమ్రాన్ మాలిక్‌తో సరదాగా గడుపుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా టీమ్ ఇండియాలో చేరడం ద్వారా తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నప్పటికీ, ఆ ఛాన్స్ దక్కలేదు.