IPL Media Rights: రేసు నుంచి తప్పుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ.. దూకుడు పెంచిన రిలయన్స్.. వేలానికి మరికొన్ని రోజులే..
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వేల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది. ఐపీఎల్ మీడియా హక్కులను స్టార్ ఇండియా గతంలో సొంతం చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగిసిన తర్వాత అభిమానుల కళ్లు మీడియా హక్కుల వేలంపైనే నిలిచాయి. IPL తదుపరి 5 సీజన్ల (2023 నుంచి 2027 వరకు) మీడియా హక్కుల వేలం జూన్ 12న (ఆదివారం) జరుగుతుంది. ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ(BCCI) వేల కోట్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అందరి చూపు ఈ వేలంపైనే నిలిచింది. ఇదిలా ఉంటే ఈ మీడియా హక్కులపై ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. నిజానికి, జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్(Amazon) ఐపీఎల్ మీడియా హక్కుల రేసు నుంచి బయట పడనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకునే రేసులో రిలయన్స్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఐపీఎల్ మీడియా హక్కుల కోసం జరుగుతోన్న యుద్ధం నుంచి బయటపడాలని అమెజాన్ ఎదురుచూస్తోంది. ఈ US దిగ్గజం ఇప్పటికే దేశంలో $ 6 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడిని పెట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మాత్రమే ఖర్చు చేయడం వాణిజ్యపరంగా సరైనది కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, Amazon నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ-వేలం ఎప్పుడు?
తొలిసారిగా ఐపీఎల్ మీడియా హక్కులను ఈ-వేలం ద్వారా డిసైడ్ చేయాలని బీసీసీఐ ఫ్లాన్ చేస్తింది. ఈ వేలం జూన్ 12న ముంబైలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. బిడ్‌లు ముగిసే వరకు కొనసాగుతుంది. కొనుగోలు చేసిన హక్కులు IPL (2023 నుంచి 2027) 5 సీజన్‌లకు చెల్లుబాటు అవుతాయి. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈసారి రూ. 50 నుంచి రూ.60 వేల కోట్లకు వేలం వేయవచ్చు.
ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి?
నాలుగు ప్యాకేజీలుగా ఐపీఎల్ మీడియా హక్కులు నిర్ణయించారు. A, B, C, Dగా విభజించారు. ప్యాకేజీ-Aలో భారత ఉపఖండం నుంచి టీవీ హక్కులు మాత్రమే ఉంటాయి. ప్యాకేజీ-బిలో డిజిటల్ హక్కులు భారత ఉపఖండంలో ప్రసారానికి మాత్రమే ఇవ్వనున్నారు. ప్యాకేజీ-Cలో భారత ఉపఖండంలో మాత్రమే ప్రసారమయ్యే ప్లేఆఫ్‌ల వంటి పరిమిత మ్యాచ్‌లకు డిజిటల్ హక్కులు చేర్చారు. అదే సమయంలో, టీవీ, డిజిటల్ కోసం హక్కులు ప్యాకేజీ-Dలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ప్రసారాలకు సంబంధించినవి.
ప్యాకేజీ -సీ లో ఏ మ్యాచ్‌లు చేర్చారు?
ప్యాకేజీ -c ‘స్పెషల్ ప్యాకేజీ’ మ్యాచ్‌లను కలిగి ఉంది. ఐపీఎల్‌లో 74 మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీలో 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఒక సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీలోని మ్యాచ్‌ల సంఖ్య 20 అవుతుంది. టోర్నీలో 94 మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీలో 22 మ్యాచ్‌లు ఉంటాయి. ఐపీఎల్ సీజన్‌లో 74 కంటే తక్కువ మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీలోని ఆటల సంఖ్య దామాషా ప్రకారం నిర్ణయించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
ఐపీఎల్ మీడియా హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రధానంగా 5 కంపెనీలు పోరాడుతున్నాయి. వీటిలో వయాకామ్, డిస్నీ-హాట్‌స్టార్, సోనీ, జీ, అమెజాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం అభిమానులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా IPLని ఆనందిస్తున్నారు. కాబట్టి డిస్నీ-హాట్‌స్టార్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా హక్కులను కొనుగోలు చేయడానికి రేసులో పాల్గొంటున్నాయి. అయితే, ప్రస్తుతం అమెజాన్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెరపైకి వచ్చింది.
2017లో..
2017లో ఐదేళ్ల (2018-22) ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకునేందుకు స్టార్ ఇండియా రికార్డు స్థాయిలో రూ.16,347.5 కోట్లు (అప్పట్లో 2.55 బిలియన్ డాలర్లు) చెల్లించింది. అప్పట్లో క్రికెట్‌లో ఇదే అతిపెద్ద మీడియా హక్కుల ఒప్పందం. గతంలో ఐపీఎల్ మీడియా హక్కుల కోసం చెల్లించిన మొత్తం కంటే ఈ డీల్ 158% ఎక్కువగా ఉంది.