ముంబై వేదికగా జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో మహిళా క్రికెటర్లకు మంచి ధర పలుకుతోంది. ఈ వేలంలో మహిళా క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకొంటుండగా.. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు పలువురిని తమ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే.. భారత్ మహిళా జట్టులోని ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌ను రూ. కోటీ 50 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సొంతం చేసుకుంది. ఈ వేలంలో రేణుకా సింగ్ బేస్ ప్రైస్ కనీసం రూ. 50 లక్షలు కాగా బెంగళూరు జట్టు ఆమె కోసం ఏకంగా కోటీ 50 లక్షలు వెచ్చించింది. భారత్ తరఫున 2021 లో ఆరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌరల్ అనతి కాలంలోనే జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది.
అయితే భారత్ తరఫున ఇప్పటివరకు 20 టీ20లు ఆడిన రేణుక.. 19.38 బౌలింగ్ యావరేజ్‌తో మొత్తం 21 వికెట్లు పడగొట్టింది. అలాగే 2022లో వన్డే క్రికెట్‌లోకి వచ్చిన ఈ ప్లేయర్ కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లతో చెలరేగింది. ఇంకా గతేడాది బర్మింగ్‌హమ్ వేదికగా జరగిన 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా అవతరించింది రేణుక. మొత్తం 11 వికెట్లతో తన జట్టుకు సిల్వర్ మెడల్ రావడంతో తన వంతు పాత్రను పోషించిన ఈ ప్లేయర్ రానున్న డబ్య్లూపీఎల్ 2023 లో బెంగళూరు టీమ్ తరఫున ఆడబోతుంది.