Sanath Jayasuriya: “చాలా బాధగా ఉంది.. ఇలా అయితే మరిన్ని ఘోరపరాజయాలు తప్పవు”; శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య
శ్రీలంక టీంను చూస్తుంటే చాలా బాధగా ఉందని, ఇలా అయితే ముందు ముందు మరిన్ని ఘోర పరాజయాలు పలకరిస్తాయని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఆందోళన వ్యక్తంచేశాడు.
Sanath Jayasuriya: శ్రీలంక టీంను చూస్తుంటే చాలా బాధగా ఉందని, ఇలా అయితే ముందు ముందు మరిన్ని ఘోర పరాజయాలు పలకరిస్తాయని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఆందోళన వ్యక్తంచేశాడు. జట్టు పరిస్థితి అస్సలు బాగోలేదని, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక టీం.. 3 టీ20ల సిరీస్‌లో తలపడిన సంగతి తెలిసిందే. మూడింట్లో ఓడిపోయి ఘోర పరాజయాలను మూటగట్టుకొంది. తొలి టీ20లో 129/7 పరుగులు సాధించిన శ్రీలంక జట్టు, రెండో టీ20లో 111/7 పరుగులు చేసింది. ఇక మూడో టీ20లో కేవలం 91 పరుగులకే చాప చుట్టేసింది. శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 91 పరుగులకే కుప్పకూలడంతో అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 89 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. శ్రీలంక జట్టును కాపాడాలని, లేదంటే రాబోయే పొట్టి ప్రపంచ కప్‌లో ఘోర పరాజయాలు తప్పవని హెచ్చరించాడు. ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక టీం ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోవడం చాలా బాధాకరమని వాపోయాడు. కాగా, శ్రీలంక 2016లో టీమిండియాపై 82 పరుగులకే ఆలౌటైంది.
మరోవైపు జులై లో టీమిండియా రెండో జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మొదటి వన్డే జులై13న ప్రారంభం కానుంది. రెండో వన్డే జులై 16న, మూడో వన్డే జులై 18న జరగనుంది. ఆ తరువాత జులై 21న తొలి టీ20 జరగనుంది. రెండో టీ20 జులై 23న, చివరి టీ20 25న జరగనుంది. అన్ని మ్యచ్‌లు ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం వన్డేలు మధ్యాహ్నం గం. 2.30లకు మొదలుకానున్నాయి. టీ20లు రాత్రి గం.7లకు ప్రారంభం కానున్నాయి.
Very sad day for Sri Lankan cricket. The situation is critical. We need immediate measures to save cricket
— Sanath Jayasuriya (@Sanath07) June 27, 2021
Also Read:
IND vs ENG: లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న భారత ఆటగాళ్లు..!