AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs MI IPL 2026 : వాంఖడేలో ‘ట్రావిషెక్’ విధ్వంసం.. అంబానీల ముందే ముంబైని ఉతికి ఆరేసిన సన్‌రైజర్స్

SRH vs MI IPL 2026 : ఐపీఎల్ 2026లో వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసినా బౌలింగ్ వైఫల్యం కారణంగా ఓటమి చవిచూసింది.

SRH vs MI IPL 2026 : వాంఖడేలో 'ట్రావిషెక్' విధ్వంసం.. అంబానీల ముందే ముంబైని ఉతికి ఆరేసిన సన్‌రైజర్స్
Srh Vs Mi Ipl 2026
Rakesh
|

Updated on: Apr 30, 2026 | 9:44 AM

Share

SRH vs MI IPL 2026 : వాంఖడే స్టేడియంలో పరుగుల సునామీ కురిసింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక క్లాసిక్ థ్రిల్లర్‌ను తలపించింది. ముంబై బ్యాటర్ రాన్ రికల్టన్ రికార్డు సెంచరీతో ముంబై శిబిరంలో ఆనందం వెల్లివిరిసినా, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి సృష్టించిన ట్రావిషెక్ తుఫాన్ ముంబై ఆశలను తుడిచివేసింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ ఏకంగా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబై ఓనర్లు నీతా అంబానీ, ఆకాష్ అంబానీలు స్టేడియంలోనే షాక్‌కు గురవ్వగా, రోహిత్ శర్మ ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణయం మొదట్లో సరైనదే అనిపించింది. ఓపెనర్ రాన్ రికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. రికల్టన్ విధ్వంసంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టేడియంలో ఉన్న నీతా అంబానీ, ఆకాష్ అంబానీలు తమ జట్టు ప్రదర్శనకు మురిసిపోయారు. ఈ విజయంతో ప్లే ఆఫ్ ఆశలు చిగురిస్తాయని అంతా భావించారు.

అయితే 244 పరుగుల లక్ష్యం సన్‌రైజర్స్‌ను ఏమాత్రం భయపెట్టలేదు. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 76), అభిషేక్ శర్మలు కలిసి ముంబై బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా హెడ్ ధాటికి తలవంచక తప్పలేదు. బుమ్రా తన 4 ఓవర్లలో వికెట్ తీయకుండానే 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విధ్వంసాన్ని చూస్తున్న ఆకాష్ అంబానీ ముఖంలో రంగులు మారాయి, రోహిత్ శర్మ అయితే నమ్మలేనట్లుగా తల పట్టుకుని ఉండిపోయాడు.

మధ్యలో గజన్‌ఫర్ వరుసగా రెండు వికెట్లు తీసి ముంబైని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేసినా, హెన్రిచ్ క్లాసెన్ ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. క్లాసెన్ కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నితీష్ రెడ్డి సహకారంతో క్లాసెన్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. 18.4 ఓవర్లలోనే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు (ఓపెనింగ్) నమోదు చేసిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలోనే ఉండిపోయింది. బ్యాటింగ్ పరంగా ముంబై పుంజుకున్నప్పటికీ, బౌలింగ్ వైఫల్యం వారిని వేధిస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబైకి ఇది మరో చేదు అనుభవం. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఫియర్ లెస్ బ్రాండ్ క్రికెట్‌తో లీగ్‌లో హాట్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. అంబానీల ముందే ముంబైని వారి సొంత గడ్డపై ఓడించడం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us