
దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ 39 ఏళ్ల ఫర్హాన్ బెహర్దీన్ తన 18 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే, అతను ట్విట్టర్‌లో ఉంచిన నోట్‌లో, అతను దేశవాళీ క్రికెట్‌లో ఆడతాడో లేదో చెప్పలేదు. ఫర్హాన్ బెహర్దీన్ దక్షిణాఫ్రికా తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2018 నవంబర్లో ఆస్ట్రేలియాతో ఆడాడు. నాలుగేళ్లుగా జట్టులోకి తిరిగి రావాలని ఎదురుచూసినా అవకాశాలు రాకపోవడంతో చివరకు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత బెహర్డీన్ బోలాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడునున్నట్లు సమాచారం. ‘గత కొన్ని వారాలు చాలా ఎమోషనల్‌గా గడిచాయి. మొత్తానికి 18 ఏళ్ల లాంగ్ కెరీర్ ముగిసింది. అన్ని ఫార్మాట్లు కలిపి 560కి పైగా మ్యాచ్‌లు ఆడాను. దేశం తరపున 97 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. నా కేబినెట్‌లో 17 ట్రోఫీలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికా తరపున నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీలు ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా’ అని తన రిటైర్మెంట్ నోట్‌లో చెప్పుకొచ్చాడు బెహర్దీన్.
ఇక ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కెరీర్ విషయానికొస్తే.. 2012 మార్చి 30న జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన T20 మ్యాచ్‌తో ఫర్హాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది అనగా జనవరి 2013లో, అతను న్యూజిలాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు. బెహర్డీన్ దక్షిణాఫ్రికా తరపున రెండు టీ20 అలాగే రెండు వన్డే ప్రపంచకప్‌లు ఆడాడు. మొత్తం 59 వన్డేల్లో 30.68 సగటుతో 1074 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 38 టీ20 మ్యాచ్‌ల్లో 32.37 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. అయితే 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఒక టెస్టు మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు బెహర్డీన్. కాగా 2017 జనవరిలో శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడీ స్టార్ ఆల్‌రౌండర్. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్ కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు.
— Farhaan Behardien (@fudgie11) December 27, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..