40 ఫోర్లు, 19 సిక్సర్లతో 426 పరుగులు.. టీ20ల్లో మరో రికార్డు.. ఇది మాములు ఊచకోత కాదు సామీ..
టీ20 మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారడం ఖాయం. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తారు.

టీ20 మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారడం ఖాయం. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తారు. సరిగ్గా ఇలాంటి సీన్ తాజాగా న్యూజిలాండ్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అక్కడ జరుగుతున్న సూపర్ స్మాష్ టోర్నమెంట్‌లో ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో మొత్తం 426 పరుగులు నమోదు అయ్యాయి. ఇందులో 5గురు బ్యాట్స్‌మెన్లు దంచికొట్టారు. ఈ మ్యాచ్‌లో 40 ఫోర్లు, 19 సిక్సర్లు నమోదయ్యాయి. ఇంతటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చివరికి ఓ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, వెల్లింగ్టన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఇక ఆ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఓపెనర్లు ఫిన్ అలెన్(33), నిక్ కెల్లీ(58) దంచికొట్టారు. ఆరంభం నుంచే బౌండరీల హోరు కొనసాగిస్తూ సెంట్రల్ డిస్ట్రిక్ట్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా వెల్లింగ్టన్ స్కోరు కేవలం 5.5 ఓవర్లు ముగిసేసరికి 80 పరుగులకు చేరుకుంది. అలాగే ట్రాయ్ జాన్సన్(35), వాన్ బీక్(21) కూడా మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగలిగింది.
చతికిలబడిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్..
215 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ చతికిలబడింది. 100 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. అయితే 5వ వికెట్‌కు కెప్టెన్ టామ్ బ్రూస్(56), జాస్ క్లార్క్‌సన్(55) జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్లారు. అయితే చివరి రెండు బంతుల్లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు అవుట్ కావడంతో 2 పరుగుల తేడాతో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మ్యాచ్ ఓడిపోయింది.




