AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRHతో శ్రేయస్ అయ్యర్ ‘లవ్ ఎఫైర్’.. కట్‌చేస్తే.. మిస్టర్ 360 రికార్డుకు ఎసరు పెట్టేశాడుగా..!

Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శివతాండవం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడి, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును శ్రేయస్ సమం చేయడం విశేషం. పంజాబ్ పోరాట పటిమకు హైదరాబాద్ బౌలర్లు తలవంచక తప్పలేదు.

SRHతో శ్రేయస్ అయ్యర్ ‘లవ్ ఎఫైర్’.. కట్‌చేస్తే.. మిస్టర్ 360 రికార్డుకు ఎసరు పెట్టేశాడుగా..!
Shreyas Iyer
Venkata Chari
|

Updated on: Apr 11, 2026 | 8:40 PM

Share

Shreyas Iyer: సన్‌రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించిన అయ్యర్, కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా, తన బ్యాటింగ్ పవర్‌తో దానిని చిన్నదిగా మార్చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ జట్టుపై శ్రేయస్‌కు ఉన్న పట్టు మరోసారి నిరూపితమైంది.

ఏబీ డివిలియర్స్ రికార్డు సమం..

ఈ అర్ధశతకంతో శ్రేయస్ అయ్యర్ ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ఫిఫ్టీతో శ్రేయస్ చేరాడు. తద్వారా గతంలో ఐదు అర్ధశతకాలు సాధించిన ఏబీ డివిలియర్స్, శుభ్‌మన్ గిల్‌ల రికార్డును అతను సమం చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (7), ఫాఫ్ డుప్లెసిస్ (6), సంజు శాంసన్ (6) మాత్రమే శ్రేయస్ కంటే ముందున్నారు.

పంజాబ్ ఓపెనర్ల మెరుపు ఆరంభం..

భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అదిరిపోయే పునాది వేశారు. వీరిద్దరూ పవర్ ప్లేలోనే 93 పరుగులు రాబట్టి సన్‌రైజర్స్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రియాంశ్ 57 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ 51 పరుగులు చేసి అవుటైనప్పటికీ, ఆ తర్వాత బాధ్యతను భుజానెత్తుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ సహకారంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశాడు.

చేజారిన హైదరాబాద్ ఆధిపత్యం..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (74) మెరుపు ఇన్నింగ్స్‌తో పవర్ ప్లేలోనే జట్టు 100 పరుగులు దాటింది. ఒకానొక దశలో 250 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ నెమ్మదిగా ఆడటం హైదరాబాద్ స్కోరు వేగాన్ని తగ్గించింది. ఆరంభంలో ఉన్న ఊపును చివర్లో ప్రదర్శించలేకపోవడం, శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్ కలగలిసి హైదరాబాద్‌కు ఓటమిని మిగిల్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us