IPL 2025: తృటిలో హ్యాట్రిక్ మిస్.. కట్ చేస్తే.. డబుల్ సెంచరీ కొట్టిన లార్డ్ శార్దూల్
శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ 2025లో లక్నో జట్టుకు ఆడుతూ అదిరిపోయే ప్రదర్శనతో 100 ఐపీఎల్ వికెట్లు, 200 టీ20 వికెట్లు సాధించాడు. గుజరాత్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ మిస్ అయినా రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి దారి తీశాడు. మళ్లీ అవకాశమిస్తే ఏ స్థాయిలో రాణించగలడో నిరూపించాడు. ఒక సమయంలో అన్‌సోల్డ్ అయిన శార్దూల్ ఇప్పుడు చరిత్ర సృష్టిస్తూ అభిమానుల గర్వకారణంగా మారాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఒక అరుదైన డబుల్ సెంచరీతో రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా శార్దూల్‌ను కొనుగోలు చేయకపోవడంతో అతడి కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో రిషబ్ పంత్ నాయకత్వంలోని జట్టు శార్దూల్‌కు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం అతడు అద్భుతంగా వినియోగించుకుంటూ తన ప్రతిభను మరోసారి చాటిచెప్పాడు. వచ్చిన వెంటనే తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన శార్దూల్, ఆత్మవిశ్వాసంతో నిలకడగా బౌలింగ్ చేస్తూ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, శార్దూల్ చివరి ఓవర్లో తన అద్భుత ప్రదర్శనతో అందరి మనసులను గెలుచుకున్నాడు. షారుఖ్ ఖాన్ తొలి బంతికే సిక్స్ కొట్టినప్పటికీ, మిగతా ఐదు బంతుల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరుసగా మూడో, నాలుగో బంతులకు షర్పాన్ రూథర్‌ఫోర్డ్‌ను ఎల్బీడబ్ల్యూగా, తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియాను తొలి బంతికే ఔట్ చేస్తూ విజృంభించాడు. హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, శార్దూల్ అప్పటికే మ్యాచ్‌ను తన వైపుగా తిప్పేశాడు.
ఈ రెండు వికెట్లతో శార్దూల్ తన టీ20 కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసి అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసిన 18వ భారత బౌలర్‌గా, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 103వ బౌలర్‌గా నిలిచాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ఈ ఘనతను సాధించిన 10వ భారత పేసర్‌గా నిలిచిన శార్దూల్, తన స్థానం మరింత బలపరిచాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ 315 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ 365 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. కాగా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది, అతను ఇప్పటివరకు 467 మ్యాచ్‌ల్లో 637 వికెట్లు తీసాడు.
ఈ రికార్డులతో శార్దూల్ ఠాకూర్ మరోసారి తనకు అవకాశమిస్తే ఎంతటి మేలుచేస్తాడో నిరూపించుకున్నాడు. ఒక ఫ్రాంచైజీ నిరాకరించిన ఈ బౌలర్, మరో జట్టుకు విజయావకాశాల తెరలు తెరిచాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..