Shane Warne Records: ఎన్ని రికార్డులో.. అన్ని వివాదాలు.. షేన్ వార్న్ జీవతంలో ఎన్నో మలుపులు..

Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Mar 05, 2022 | 12:58 PM

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌.. అకాల మరణం క్రీడా లోకంలో విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్‌లోని తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు...

Shane Warne Records: ఎన్ని రికార్డులో.. అన్ని వివాదాలు.. షేన్ వార్న్ జీవతంలో ఎన్నో మలుపులు..
Shane Warne

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌.. అకాల మరణం క్రీడా లోకంలో విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్‌లోని తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు ప్రకటించారు వైద్యులు. 15 ఏళ్లపాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించిన.. వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రపంచ దిగ్గజ బౌలర్లలో షేన్‌వార్న్‌ది ఓ ట్రెండ్‌. వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్లనే ముప్పుతిప్పలు పెట్టిన స్పిన్ మాంత్రికుడిగా గుర్తింపు పొందారు వార్న్. 1992నుంచి 2007 వరకూ ఆస్ట్రేలియా జట్టులో వార్న్ ప్రస్థానం సాగింది. 145 టెస్టులు, 194 వన్డేల్లో లెజెండరీ షో షేన్ వార్న్ సొంతం.

రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 1001 వికెట్లు తీసి.. జట్టుకు అద్వితీయ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో పదిసార్లు పదికి పది వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు తీసిన రికార్డ్ కూడా వార్న్‌కే చెల్లింది. ఇండియన్ ప్రీమియర్‌లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్‌లో టైటిల్‌ను ముద్దాడారు. రిటైర్మెంట్ తర్వాత వార్న్ కోచ్‌గానూ సేవలందించారు. కామెంటేటర్‌గా, టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌గా మారి ఐదేళ్లుగా చాలా చురుగ్గా ఉన్నారు. 1993 జూన్ 4. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్. అప్పటికే వార్న్ 11 టెస్టులు ఆడి 31 వికెట్లు తీసున్నాడు. మొదటి టెస్ట్ రెండో రోజు మధ్యాహ్నం లంచ్ ముగిసిన తర్వాత షేన్ వార్న్ తొలి బంతిని వేశాడు. మైక్ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన ఆ బంతే బాల్ ఆఫ్ ది సెంచరీగా రికార్డులకెక్కింది. బంతి పిచ్‌పై పడిన దగ్గర్నుంచి 18 అంగుళాలు మలుపు తిరిగి ఆఫ్ వికెట్‌ను కూల్చింది.

అసలు వార్న్ టెస్టుల్లో ఆరంగేట్రం చేసింది భారత్‌ మ్యాచ్‌తోనే. 1992 జనవరి 2న సిడ్నీలో భారత్‌తో మొదలైన టెస్ట్ మ్యాచ్‌తోనే. ఆ సిరీస్‌లో అది మూడో టెస్టు. వార్న్ తొలి వికెట్ మన రవిశాస్త్రే. ఈమ్యాచ్ తర్వాతే క్రికెట్ ప్రపంచానికి బంతికి బ్యాటుకు మధ్య సమరం ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్ అంటే అందులో సచిన్ బ్యాటుకు…షేన్‌వార్న్ బౌలింగ్‌కు మధ్య జరిగే యుద్ధంలా చూసేది అభిమానలోకం. ఈపోటీ ఎంత రసవత్తరంగా ఉండేదంటే.. వార్న్ బౌలింగ్ అంటే చాలు.. సచిన్ బ్యాటు శివాలెత్తిపోయేది. స్టేడియం పరుగుల మోత మోగేది.. ఓరకంగా ప్రపంచంలో ఏ క్రికెటరూ అర్థం చేసుకోలేనంతగా వార్న్ బౌలింగ్‌ను చదివింది సచిన్ ఒక్కడే అంటారు క్రీడా పండితులు.

వార్న్ కెరీర్‌లో పేరు ప్రతిష్టలతో పాటు కొన్ని వివాదాలు షేన్ వార్న్‌ ను కాస్తా షేమ్..వార్న్ అనేస్థాయికి తీసుకెళ్లాయి. 2000 సంవత్సరంలో ఓ బ్రిటీష్ నర్సుకు శృంగార సందేశాలు పంపాడన్న కారణంగా వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2003లో నిషేధిత డ్రగ్ వార్న్ తీసుకున్నాడని డోపింగ్ టెస్టులో తేలింది. దీంతో వార్న్‌పై నిషేధం వేటు పడింది. తర్వాత బుకీలతో సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్‌ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు షేన్‌వార్న్ ఉమనైజర్ అని.. ఎంతో మంది మహిలలతో లైంగిక సంబంధాలున్నాయన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. 2006లో అండర్ వేర్స్‌తో మహిళలతో దిగిన ఫోటోలు షేన్‌వార్న్‌ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. ఇక వైవాహిక బంధంలోనూ కష్టాలు చుట్టుముట్టాయి. 2007లో వార్న్, అతని భార్య సిమోన్ తిరిగి కలిసినా…నటి ఎలిజిబెత్ హార్లీతో సంబంధం నిశ్చితార్ధం దాకా వెళ్లడంతో భార్య తిరిగి వెళ్లిపోయింది.

Read Also.. Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. వారికి సెబీ హెచ్చరిక..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2022 09:41 AM (IST)

    షెన్ వార్న్ మరణం చాలా బాధకరం

    షెన్ వార్న్ మరణం చాలా బాధకరమని భారత మహిళా క్రికెటర్‌ మితాలి రాజ్ అన్నారు. ఆయన మరణం క్రికెట్ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు తీరని లోటు అన్నారు.

  • 05 Mar 2022 09:04 AM (IST)

    వార్న్ గొప్ప బౌలర్..

    షెన్ వార్న్ గొప్ప బౌలర్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అన్నారు. అతన్ని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు.

  • 05 Mar 2022 07:50 AM (IST)

    క్రికెట్ సోదరులందరికీ విచారకరమైన రోజు

    షేన్‌ వార్న్ మరణం విచారకరమైన వార్తని పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్‌ ఆసిఫ్ అన్నాడు. క్రికెట్ సోదరులందరికీ విచారకరమైన రోజు అని చెప్పాడు. వారికి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

  • 05 Mar 2022 07:25 AM (IST)

    వసీం జాఫర్ సంతాపం

    షేన్ వార్న్ ఇక లేడని తన మనస్సు అంగీకరించడం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నారు. షేన్‌ వార్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అతని ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షించారు.

Published On - Mar 05,2022 7:19 AM

Follow us