LSG vs KKR : 24 బంతుల్లో 52 పరుగులు.. అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన షమీ.. కానీ ఫలితం మాత్రం?
LSG vs KKR : ఐపీఎల్ 2026లో కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌గా ముగిసింది. మహమ్మద్ షమీ చివరి బంతి సిక్సర్, సునీల్ నరైన్ సూపర్ ఓవర్ స్పెల్‌తో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. లక్నో ఓడిపోవడం ఖాయం అనుకున్ను మ్యాచ్‌ను మహమ్మద్ షమీ తన బ్యాటింగ్‌తో ఊహించని మలుపు తిప్పాడు.

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన పోరు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. ఒక దశలో లక్నో ఓడిపోవడం ఖాయం అనుకున్ను మ్యాచ్‌ను మహమ్మద్ షమీ తన బ్యాటింగ్‌తో ఊహించని మలుపు తిప్పాడు. చివరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను టై చేయడంతో ఆట సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అయితే సూపర్ ఓవర్‌లో కోల్‌కతా మ్యాజిక్ చేయడంతో లక్నోకు నిరాశే మిగిలింది.
లక్నో విజయానికి చివరి 24 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో ఆయుష్ బదోని, హిమ్మత్ సింగ్ ఉన్నారు. కార్తీక్ త్యాగి వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు రావడంతో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి బదోనీని అవుట్ చేసినా, జార్జ్ లిండే రెండు ఫోర్లతో 10 పరుగులు రాబట్టాడు. ఇక చివరి 12 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్‌లో షమీ, హిమ్మత్ సింగ్ చెరో ఫోర్ కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్‌ను రహానే యువ బౌలర్ కార్తీక్ త్యాగికి ఇచ్చాడు. మొదటి బంతికే షమీ సింగిల్ తీశాడు. ఆ తర్వాత త్యాగి వరుసగా రెండు నోబాల్స్ వేసి లక్నోకు అవకాశం ఇచ్చాడు. ఫ్రీ హిట్‌లో హిమ్మత్ సింగ్ ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ 3 బంతుల్లో 8 పరుగులకు చేరింది. నాలుగో బంతికి ప్రిన్స్ యాదవ్ సింగిల్ తీయడంతో షమీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఐదో బంతి డాట్ అవ్వడంతో చివరి బంతికి 7 పరుగులు (అంటే కచ్చితంగా సిక్సర్) కావాలి. అప్పుడు షమీ అద్భుతం చేశాడు. త్యాగి వేసిన లెంగ్త్ బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను టై చేశాడు. దీంతో ఆట సూపర్ ఓవర్‌కు వెళ్ళింది.
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు కోల్‌కతా స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ చుక్కలు చూపించాడు. నికోలస్ పూరన్‌ను మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. రిషబ్ పంత్ ఒక పరుగు మాత్రమే తీయగా, మూడో బంతికి ఎయిడెన్ మార్‌క్రామ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో లక్నో సూపర్ ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తరపున రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ బాది జట్టుకు రెండో విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను రింకూ సింగ్ (83 పరుగులు) ఒంటరి పోరాటంతో ఆదుకోవడంతో 155 పరుగులు చేసింది. మొహ్సిన్ ఖాన్ 23 పరుగులకే 5 వికెట్లు తీసినా, రింకూ విధ్వంసం ముందు ఆ ప్రదర్శన మరుగున పడిపోయింది. చివరలో షమీ పోరాటం మెప్పించినా, సూపర్ ఓవర్‌లో లక్నో బ్యాటర్లు తలవంచడంతో కేకేఆర్ విజేతగా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
