Pakistan Cricket : పాక్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం.. అఫ్రిదిని గెంటేయడం వెనుక అసలు స్కెచ్ ఇదేనా ?
Pakistan Cricket : పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని రెడ్ బాల్ క్యాంప్ నుంచి PCB తప్పించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టెస్ట్ జట్టులో భవిష్యత్తు ప్రణాళికల్లో అతడికి చోటు లేకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్ బాల్ క్యాంప్ జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరగనుంది.

Pakistan Cricket : పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఊహించని షాక్ ఇచ్చింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రారంభం కానున్న రెడ్ బాల్ (టెస్ట్ క్రికెట్) శిక్షణ శిబిరం నుంచి అతడిని పక్కన పెట్టింది. రాబోయే అంతర్జాతీయ, దేశవాళీ సిరీస్‌ల కోసం పీసీబీ మొత్తం 49 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి.. వారికి విడివిడిగా రెడ్ బాల్, వైట్ బాల్ క్యాంప్‌లను ప్రకటించింది. అయితే అత్యంత కీలకమైన రెడ్ బాల్ క్యాంప్‌లో అఫ్రిది పేరు లేకపోవడం ఇప్పుడు పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పీసీబీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రెడ్ బాల్ క్యాంప్ జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరగనుంది. దీనికోసం మొత్తం 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అఫ్రిదిని కేవలం వైట్ బాల్ (వన్డే, టీ20) క్యాంప్‌కు మాత్రమే పరిమితం చేయడం చూస్తుంటే.. పాకిస్తాన్ టెస్ట్ జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడికి చోటు లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ 2-1తో గెలవడంలో అఫ్రిది 7 వికెట్లతో కీలక పాత్ర పోషించినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి బోర్డు అతడిని పక్కన పెట్టడం గమనార్హం.
బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవమే కారణమా?
గత కొంతకాలంగా పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రదర్శన తీవ్ర విమర్శలపాలవుతోంది. ఇటీవలే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ వరుసగా టెస్ట్ సిరీస్‌లలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ జట్టు పాక్‌ను వారి సొంతగడ్డపైనే వరుసగా రెండోసారి క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చింది. ఈ సిరీస్‌లో అఫ్రిది రెండు ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు తీసినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు. బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఈ అవమానకర ఓటమి తర్వాతే పీసీబీ టెస్ట్ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అయితే అఫ్రిదిని తొలగించడంపై బోర్డు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
క్యాంప్‌లో స్టార్ ప్లేయర్స్.. విండీస్ సిరీస్‌పై కన్ను
అఫ్రిది లేకపోయినప్పటికీ.. బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, అమీర్ జమాల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు రెడ్ బాల్ క్యాంప్‌లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు సుదీర్ఘంగా సాగే వైట్ బాల్ క్యాంప్‌లో 27 మంది ఆటగాళ్లతో కలిసి అఫ్రిది శిక్షణ పొందనున్నాడు. ప్రస్తుతం దొరికిన 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత, పాకిస్తాన్ జట్టు జూలై 25 నుంచి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ లోపే అఫ్రిదిని టెస్ట్ క్యాంప్ నుంచి తప్పించడం సంచలనంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
