IPL 2025: వీరికి ఇంకా వయసు అవ్వలేదు! మైదానంలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న టాప్ 10 సీనియర్ ఆటగాళ్లు
ఐపీఎల్ 2025లో అనుభవజ్ఞులైన 10 మంది సీనియర్ ఆటగాళ్లు తమ జట్లకు బలంగా నిలవనున్నారు. ధోని, రోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వయస్సును త్రోసి కొట్టుతూ మరోసారి తమ ప్రతిభను నిరూపించేందుకు సిద్ధమయ్యారు. వీరి ఆటతీరుపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.
ఐపీఎల్ 2025కు భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం 228 మంది ఆటగాళ్లకు చోటు దక్కగా, వీరిలో తమ అనుభవంతో జట్లకు బలం చేకూర్చబోతున్న సీనియర్ క్రికెటర్లు కూడా ఉన్నారు. వేలం ముగిసిన తర్వాత 182 మంది ఆటగాళ్లు కొత్త జట్లలో చేరగా, 46 మంది ఆటగాళ్లు తమ పాత జట్లలో కొనసాగుతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో తమ వయస్సును త్రోసి కొట్టి పోటీపడబోయే 10 మంది సీనియర్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 43 ఏళ్ల వయస్సు ఉన్న ధోని ఇప్పటికీ సీఎస్‌కే అభిమానులకు ముద్దుబిడ్డ. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించి అభిమానుల గుండెల్లో “తలైవా”గా పేరొందిన ధోని పసుపు జెర్సీని ఈసారి కూడా తలపడుతూ కనిపించనున్నారు.
2. ఫాఫ్ డు ప్లెసిస్
40 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. డు ప్లెసిస్ IPL టోర్నమెంట్‌లో 145 మ్యాచ్‌ల్లో 4571 పరుగులు చేశారు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించిన ఈ వెటరన్ క్రికెటర్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
3. రవిచంద్రన్ అశ్విన్
అశ్విన్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 38 ఏళ్ల వయసుగల ఈ ఆటగాడు ఈసారి సీఎస్‌కేకు కీలక ఆటగాడిగా నిలుస్తాడు. అశ్విన్ వేలంలో రూ.9.75 కోట్లకు అమ్ముడయ్యాడు.
4. రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ ఈ సీజన్‌కు కూడా MI అతన్ని రీటైన్ చేసుకుంది. 37 ఏళ్ల రోహిత్ 257 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6628 పరుగులు చేశారు. అతని అనుభవం, దూకుడు బ్యాటింగ్ ముంబై జట్టుకు మరోసారి బలంగా నిలవనుంది.
5. మొయిన్ అలీ
ఇంగ్లండ్ ప్లేయర్ అయిన మొయిన్ అలీ వయసు 37 ఏళ్లు. 67 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1162 పరుగులు, 35 వికెట్లు తీసిన ఈ క్రికెటర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని అల్ రౌండర్ ప్రదర్శన జట్టుకు మంచి బలాన్ని చేకూరుస్తుంది.
6. కరణ్ శర్మ
37 ఏళ్ల కరణ్ శర్మ ఐపీఎల్‌లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడబోతున్నాడు. 84 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు తీసిన కరణ్‌ను ముంబై రూ.50 లక్షలకు దక్కించుకుంది.
7. ఆండ్రీ రస్సెల్
రస్సెల్, ఐపీల్ లో పరిచయం అవసరం లేని పేరు. 37 ఏళ్ల వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకుంది. 126 మ్యాచ్‌ల్లో 2484 పరుగులు, 115 వికెట్లు తీసిన ఈ స్టార్ ఆటగాడు జట్టుకు విధ్వంసం అయిన బ్యాటింగ్ తో పాటు డెత్ ఓవర్లులో స్లో బంతులతో కీలక బలాన్ని అందిస్తాడనడంలో సందేహం లేదు.
8. సునీల్ నరైన్
36 ఏళ్ల సునీల్ నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఎన్నో విజయాలు సాధించారు. 176 మ్యాచ్‌ల్లో 180 వికెట్లు తీసిన నరైన్, ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు. ధీటైన ఓపెనింగ్ బ్యాటింగ్ ఏ కాకుండా ఏ స్థానంలో అయినా పరుగులు సాధించగల ఆటగాడు ఈ నరైన్.
9. అజింక్య రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన అజింక్య రహానే 36 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఆడుతాడు. 185 మ్యాచ్‌ల్లో 4642 పరుగులు చేసిన ఈ ఆటగాడు రెండుసార్లు సెంచరీ కూడా సాధించాడు. తాజాగా పేర్కొన్న ఓ నివేదిక ప్రకారం కోల్‌కతా యాజమాన్యం ఇతనికి కెప్టెన్సీ పట్టం కట్టనుంది.
10. ఇషాంత్ శర్మ
36 ఏళ్ల ఇషాంత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. 110 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు తీసిన ఈ పేసర్ వేలంలో రూ.75 లక్షలకు అమ్ముడయ్యాడు.
ఈ సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో జట్లకు ప్రేరణగా నిలుస్తారని, మరోసారి వాళ్ళ ఆటతీరుతో మజాను పంచుతారని అభిమానులు వేచి ఉన్నారు!