ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. ఫ్రస్టేషన్‌లో 10 కేజీలు తగ్గి, ఇంగ్లండ్ టూర్‌కు లక్కీ ఛాన్స్ పట్టేశాడుగా
Sarfaraz khan: ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని నిరాశను తన ఎదుగుదలకు ఉపయోగించుకున్న టీమిండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కృషి, పట్టుదల భారత క్రికెట్ అభిమానులకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

Sarfaraz Khan: భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్‌ను మలుపు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయకపోవడంతో, సర్ఫరాజ్ ఆ నిరాశను తన ఫిట్‌నెస్, ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. గత ఐదు నెలలుగా కఠినమైన శిక్షణతో పాటు, ఆహార నియమాలు పాటించి ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడు. ప్రస్తుతం రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
ఐపీఎల్ నిరాశ నుంచి కొత్త రూపం..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్ అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలవడం అతడికి పెద్ద షాక్. అయితే, ఈ ఎదురుదెబ్బ అతడిని మరింత దృఢంగా మార్చింది. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పకుండా వ్యాయామాలతో 10 కేజీల బరువు తగ్గాడు. అతని తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ పర్యవేక్షణలో అన్నం, గోధుమలకు దూరంగా ఉండి, ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, కూరగాయలు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాడు. ఈ బరువు తగ్గడం అతడి ఫిట్‌నెస్‌ను గణనీయంగా మెరుగుపరిచింది.
ఇంగ్లాండ్ స్వింగ్ బాల్‌కు ప్రత్యేక శిక్షణ..
ఇంగ్లాండ్ పిచ్‌లు స్వింగ్, సీమ్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, సర్ఫరాజ్ తన బ్యాటింగ్‌లో సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాడు. తన తండ్రి పర్యవేక్షణలో రోజుకు 300 నుంచి 500 స్వింగ్ బంతులను ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆఫ్-స్టంప్‌కు వెలుపల వచ్చే బంతులను ఎలా ఆడాలి, ఎలా వదిలేయాలి అనే దానిపై కఠినమైన సాధన చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో రాణించడానికి ఇది చాలా కీలకమని సర్ఫరాజ్ నమ్ముతున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో స్థానం కోసం పోరాటం..
సర్ఫరాజ్ ఖాన్ 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టు మ్యాచ్‌లలో 37.10 సగటుతో 371 పరుగులు చేసి, ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. అయితే, విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఇంకా అతడికి రాలేదు. రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత ‘ఏ’ జట్టులో ఎంపికవడం సర్ఫరాజ్‌కు ఒక పెద్ద అవకాశం. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిస్తే, అతను సీనియర్ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ జట్టులో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి సర్ఫరాజ్ ఖాన్ ఒక బలమైన పోటీదారుడు.
ఐపీఎల్‌లో అమ్ముడుపోని నిరాశను తన ఎదుగుదలకు ఉపయోగించుకున్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కృషి, పట్టుదల భారత క్రికెట్ అభిమానులకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




