Sanju Samson : సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల మైండ్ బ్లాక్ చేస్తున్న కేరళ స్టార్..వన్డే టీమ్‌లో చోటు ఖాయమేనా?
Sanju Samson : కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాట్‌తో గర్జించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ కొట్టి కదం తొక్కాడు. అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన ఐదో రౌండ్ పోరులో సంజూ శాంసన్ తన విశ్వరూపాన్ని చూపించాడు.

Sanju Samson : కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాట్‌తో గర్జించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న తరుణంలో, సంజూ చేసిన ఈ సెంచరీ ఇప్పుడు సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. జార్ఖండ్‌తో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో సంజూ క్లాస్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది.
అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన ఐదో రౌండ్ పోరులో సంజూ శాంసన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. జార్ఖండ్ నిర్దేశించిన 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేరళ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (124) తో కలిసి సంజూ ఇన్నింగ్స్‌ను పరిగెత్తించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజూ కేవలం 90 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తం 95 బంతులు ఆడిన సంజూ, 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి టీమ్ ఇండియా సెలక్టర్లకు గట్టి సంకేతాలు పంపాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టులో కుమార్ కుశాగ్ర విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 137 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచినప్పటికీ, కుశాగ్ర, అనుకూల్ రాయ్ (72) పుణ్యమా అని ఆ జట్టు 311 పరుగులు చేసింది. అయితే, ఇంత పెద్ద టార్గెట్‌ను కూడా సంజూ, రోహన్ జంట చాలా సులువుగా మార్చేశారు. రోహన్ కేవలం 78 బంతుల్లోనే 11 సిక్సర్లతో 124 పరుగులు చేయడం విశేషం.
సంజూ శాంసన్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏంటంటే.. వన్డేల్లో సంజూ స్ట్రైక్ రేట్ దాదాపు 100గా ఉంది. 2023 డిసెంబర్‌లో చివరిసారిగా వన్డే ఆడిన సంజూ, ఆ తర్వాత టీ20ల్లో మూడు సెంచరీలు బాది భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో కూడా సెంచరీ సాధించడంతో, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో పాటు మూడో వికెట్ కీపర్‌గా సంజూ పేరును సెలక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది.
జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ త్వరలోనే జట్టును ప్రకటించనుంది. సాధారణంగా వన్డేల్లో పంత్, రాహుల్‌లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ, సంజూ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే అతడిని పక్కన పెట్టడం సెలక్టర్లకు తలకు మించిన భారమే. పైగా టాప్ ఆర్డర్‌లో ఎవరైనా సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే, సంజూను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్‌గానైనా జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
