Devdutt Padikkal : ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలా? పడిక్కల్ కి ఏమైనా పూనకం వచ్చిందా ఏంటి?
Devdutt Padikkal :టీమిండియా తలుపు తడుతున్న మరో యంగ్ స్టార్ దేవదత్ పడిక్కల్. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో పడిక్కల్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ మరో అద్భుతమైన సెంచరీ బాదాడు.

Devdutt Padikkal :టీమిండియా తలుపు తడుతున్న మరో యువ కెరటం దేవదత్ పడిక్కల్. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో పడిక్కల్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ మరో అద్భుతమైన సెంచరీ బాదాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే ఇది ఆయనకు నాలుగో సెంచరీ కావడం విశేషం. ఈ అసాధారణ ఫామ్ చూస్తుంటే, త్వరలో జరగబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో పడిక్కల్‌కు చోటు ఖాయమనిపిస్తోంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో త్రిపురతో జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5), కరుణ్ నాయర్ (0) ఒకే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే పడిక్కల్ ఏమాత్రం తొందరపడకుండా స్మరణ్ రవిచంద్రన్ (70) తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 120 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి జట్టు 332 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో పడిక్కల్ ఫామ్ చూస్తుంటే బౌలర్లు గజగజ వణికిపోతున్నారు. టోర్నీలో ఆయన జార్ఖండ్‌పై 147 పరుగులు, కేరళపై 124 పరుగులు, పుదుచ్చేరిపై 113 పరుగులు, తాజాగా త్రిపురపై 108 పరుగులు. కేవలం తమిళనాడుపై మాత్రమే 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఒకే టోర్నమెంట్‌లో వరుసగా సెంచరీలు బాదుతూ విరాట్ కోహ్లీ, పృథ్వీ షా వంటి ఆటగాళ్ల రికార్డుల సరసన చేరుతున్నాడు. పడిక్కల్ క్లాసిక్ బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే ప్రత్యర్థి జట్టుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
దేవదత్ పడిక్కల్ కేవలం ఈ టోర్నీలోనే కాదు, ఓవరాల్‌గా లిస్ట్-ఏ (వన్డే ఫార్మాట్) క్రికెట్‌లో భీభత్సమైన రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 37 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 13 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు బాదాడు. అంటే ఆడిన ప్రతి మూడు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ చేస్తున్నాడన్నమాట. ఆయన బ్యాటింగ్ సగటు 80 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంతటి కన్సిస్టెన్సీ ఏ ఇతర యువ ఆటగాడిలోనూ కనిపించడం లేదు. అందుకే ఆయనను టీమ్ ఇండియాలో చేర్చుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం బీసీసీఐ సెలక్టర్లు త్వరలోనే జట్టును ప్రకటించబోతున్నారు. వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం, ఇతర సీనియర్ల విశ్రాంతి వంటి కారణాల వల్ల పడిక్కల్‌కు ఓపెనర్‌గా లేదా మూడో నంబర్‌లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ కుర్రాడికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
