Ross Taylor: డకౌట్ అయ్యానని రాజస్థాన్ ఓనర్ నాలుగు చెంప దెబ్బలు కొట్టాడు.. టేలర్ షాకింగ్ కామెంట్స్
Indian Premier League: రాస్ టేలర్ తన ఆత్మకథ 'బ్లాక్ అండ్ వైట్'లో ఒక మ్యాచ్‌లో విఫలమైనందుకు అప్పటి రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బలు కొట్టాడని షాకింగ్ విషయం చెప్పాడు.
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా మంది ఆటగాళ్లపై డబ్బు వర్షం కురిపించింది . 2008లో ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్‌తో ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అదే సమయంలో ఈ మెగా క్రికెట్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లపై అంచనాలు భారీగానే ఉంటాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోతే జట్టు నుంచి ఏ మాత్రం ఆలోచించకుండా తొలగిస్తారు. కానీ మైదానంలో రాణించకపోయినంత మాత్రాన ఆటగాళ్లను కొడతారా? సహజంగానే ఇది అసంభవం. అయితే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ విషయంలో ఇది నిజంగానే జరిగింది. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల సొంత ఆటగాళ్ల నుంచే వివక్ష ఎదుర్కొన్నానంటూ సంచలన కామెంట్లు చేసిన టేలర్ ఇప్పుడు ఐపీఎల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అందుకే ఇష్యూ చేయలేదు..
టేలర్ తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’లో ఒక మ్యాచ్‌లో విఫలమైనందుకు అప్పటి రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బలు కొట్టాడని షాకింగ్ విషయం చెప్పాడు. ‘మొహాలీలో రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. లక్ష్యం195, నేను సున్నాకే ఎల్‌బిడబ్ల్యూ ఔట్ అయ్యాను. దీంతో ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అప్పుడు రాయల్స్ యజమాని ఒకరు నా దగ్గరకు వచ్చి, ‘రాస్.. డకౌట్ అవ్వడానికేనా మేము మీకు మిలియన్ డాలర్లు ఇచ్చేది అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపై నన్ను 3-4 సారర్లు చెంపదెబ్బలు కొట్టారు. అక్కడ షేన్ వార్న్, లిజ్ హుర్లే కూడా తదితరులు ఉన్నారు. అయినా అతను నవ్వుతూనే ఉన్నాడు. అవేవీ గట్టి దెబ్బలు కాదు. అయితే ఇది కావాలని నాటకమాడినట్లు పూర్తిగా అనిపించలేదు. దీన్ని పెద్ద ఇష్యూ చేయదల్చుకోలేదు. అయితే క్రీడావృత్తిలో ఇలాంటి పరిస్థితిని వస్తుందని అసలు ఊహించలేదు’ అని టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా రాస్ టేలర్, IPL ప్రారంభ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్‌లో భాగమయ్యాడు.