AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : రోహిత్ శర్మకు డేంజర్ బెల్స్.. మరోసారి విఫలమైతే జట్టులో చోటు కష్టమేనా ?

Rohit Sharma : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు రోహిత్ శర్మ ఫామ్ చర్చనీయాంశంగా మారింది. జట్టులో పెరుగుతున్న పోటీ, యువ ఆటగాళ్ల సవాల్ మధ్య హిట్‌మ్యాన్ మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

Rohit Sharma : రోహిత్ శర్మకు డేంజర్ బెల్స్.. మరోసారి విఫలమైతే జట్టులో చోటు కష్టమేనా ?
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 15, 2026 | 8:14 PM

Share

Rohit Sharma : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు రెండో వన్డే మ్యాచ్ ఆడటానికి ముందే ఒక పెద్ద ఆందోళన పట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 తో ముందంజలో ఉన్న టీమిండియా.. గురువారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ కీలక సమరానికి ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ సమస్య జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. మొదటి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో 80 పరుగులు చేసిన గిల్, కండరాల నొప్పితో అర్ధాంతరంగా రిటైర్డ్ హర్ట్ అయి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతను త్వరగా కోలుకోవాలని టీమిండియా అభిమానులు, యాజమాన్యం గట్టిగా ప్రార్థిస్తున్నారు. గిల్ ఇలా ఫిట్‌నెస్ సమస్యల వల్ల మ్యాచ్ మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో కూడా ఇలాగే మైదానం వీడి, ఏకంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని జట్టు కోరుకుంటోంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ ఫిట్‌నెస్‌తో పాటు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్‌పై కూడా అందరి కళ్లూ ఉన్నాయి. రోహిత్ శర్మకు ఎలాంటి శారీరక సమస్యలు లేనప్పటికీ, అతని ఇటీవలి ఆటతీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నుంచి రోహిత్ ఆడిన 13 వన్డేల్లో 46.91 సగటుతో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 563 పరుగులు చేశాడు. ఇది మంచి రికార్డే అయినప్పటికీ, జట్టులోని ప్రస్తుత తీవ్రమైన పోటీ వల్లే రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా విఫలమైతే 2027 వన్డే వరల్డ్ కప్ రేసు నుంచి రోహిత్ తప్పుకోవాల్సి వస్తుందని ఇప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది. కానీ ఇటీవల సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లను ఫామ్ లేమి కారణంగా జట్టు నుంచి పక్కన పెట్టిన విధానం, 39 ఏళ్ల రోహిత్‌కు ఒక గట్టి హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బెంచ్‌పై ఇషాన్ కిషన్ లాంటి దూకుడున్న ఓపెనర్ అవకాశం కోసం సిద్ధంగా ఉన్నాడు.

మరోవైపు సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతను ఫిట్‌నెస్, రికార్డుల పరంగా చాలా మెరుగైన స్థితిలో ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆడిన 10 మ్యాచ్‌ల్లో కోహ్లీ 77.62 అద్భుతమైన సగటుతో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 621 పరుగులు చేశాడు. మొదటి వన్డేలో కోహ్లీ కూడా 5 పరుగులకే అవుట్ అయినప్పటికీ, జట్టులో అతని స్థానానికి ఎలాంటి డోకా లేదని స్పష్టమవుతోంది.

భారత జట్టుకు దక్కిన అతిపెద్ద సానుకూల అంశం ఏమిటంటే.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ తన పాత లయను అందుకోవడం. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్ లోకి వచ్చిన బుమ్రా మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అలాగే ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద బూస్టింగ్ ఇచ్చింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ పిచ్ సాధారణంగా మంచి బౌన్స్, వేగానికి అనుకూలిస్తుంది కాబట్టి, ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో గత మ్యాచ్‌లో పరుగులు భారీగా సమర్పించుకున్న యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ స్థానంలో అనుభవజ్ఞుడైన లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి రావచ్చు.

మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. 2025 నుంచి ఆడిన 19 వన్డేల్లో ఏకంగా 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్, ఈ ఘోరమైన రికార్డును బ్రేక్ చేయాలని చూస్తోంది. అయితే కార్డిఫ్ మైదానంలో ఇంగ్లాండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక్కడ ఆడిన 17 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 10 సార్లు గెలిచి, కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. కాబట్టి హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ రేపే రెండో వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us