ఇది నేను ఎప్పుడు చూడలా! టైటిల్ ఫేవరెట్స్ RCB నే.. కుండబద్దుల కొట్టిన టీమిండియా లెజెండ్..
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, RCB ఐపీఎల్ 2025 టైటిల్ ఫేవరెట్ జట్టుగా అభివర్ణించారు. రాజత్ పాటిదార్ నేతృత్వంలో బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన ఈ జట్టు, ప్లేఆఫ్స్ అర్హతకు ఒక్క విజయం దూరంలో ఉంది. టాప్-ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు మరియు బలమైన ఐక్యత RCB విజయానికి బలమైన ఆయుధాలు.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ RCB గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఐపీఎల్ ట్రోఫీ గెలిచే బలమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అభివర్ణించారు. “ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్స్ RCBనే” అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మాట్లాడిన గవాస్కర్, RCB సమతుల్యత ఉన్న స్క్వాడ్, స్థిరమైన ప్రదర్శనలపై ప్రశంసలు కురిపించారు. ఈ సీజన్‌లో RCB ఆకట్టుకునే ఆటతీరును ప్రదర్శిస్తోంది. రాజత్ పాటిదార్ నేతృత్వంలో ఐపీఎల్ 2025లో ఏడు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా RCB నిలిచింది. మే 3న జరిగే చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్‌లో విజయం సాధిస్తే, పాయింట్ల పట్టికలో RCB టాప్‌కు చేరనుంది.
“RCB బ్యాటింగ్ బాగా చేసింది, ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా ఉంది. వారికి ముంబై ఇండియన్స్ మాత్రమే పోటీ ఇవ్వగలరు, కానీ వారు ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్నారు. మూడు కఠినమైన మ్యాచులు వారికోసం ఉన్నాయ్. వారు ఆ ఫామ్‌ను కొనసాగిస్తేనే చూస్తాం. కానీ ఇప్పటివరకు చూస్తే, టైటిల్‌కు ప్రధాన పోటిదారు RCBనే” అని గవాస్కర్ చెప్పారు.
అదిరిపోయే ఫామ్‌లో ఉన్న RCB
10 మ్యాచ్‌లలో 7 విజయాలతో, RCB ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆవుట్‌డోర్ మ్యాచ్‌లలో ఓటమి లేకుండానే RCB అదరగొట్టింది. గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, ముంబై ఇండియన్స్ మాత్రమే రన్ కోసం పోటీ ఇవ్వగల జట్టు. కానీ ముంబై సీజన్‌ను నీరసంగా ప్రారంభించగా, RCB ఇప్పటివరకు అద్భుత స్థిరతను చూపించింది.
అభినవ నాయకత్వంతో ఐక్యత చాటుతున్న RCB
కొత్త కెప్టెన్ రాజత్ పాటిదార్ నాయకత్వంలో, RCB 2025లో అత్యంత ఐక్యతతో కూడిన జట్టుగా ఎదిగింది. ఒకరిద్దరిపై ఆధారపడే పాత ఛాయలు పోయాయి. వివిధ మ్యాచ్‌లలో వేరే వేరే ఆటగాళ్లు మెరుస్తూ జట్టును విజయ దిశగా నడిపిస్తున్నారు. 7 విజయాల్లో 5 మంది ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు పొందడం దీన్ని నిరూపిస్తోంది. జోష్ హేజిల్వుడ్, క్రుణాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ మాత్రమే కాక, టిమ్ డేవిడ్, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి వారు కూడా కీలక సమయాల్లో నిలబడి RCB స్థిరతకు బలాన్నిచ్చారు.
RCB ప్లేఆఫ్స్ కు అర్హత.. ఒక విజయం దూరంలో
RCBకి మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం ఒకటి గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత దాదాపుగా ఖాయం. అయితే ఆ నాలుగు మ్యాచ్‌ల్లో మూడూ హోమ్‌గ్రౌండ్‌లో ఉండటంతో, అక్కడ వారి అస్థిరత దృష్ట్యా వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. RCB అభిమానుల ఆశలు ఇప్పుడు మరింత పెరిగాయి. టైటిల్ కల నిజం కావాలంటే, ఈ జోరును కొనసాగించాలి!
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



