
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కేవలం ఒక జట్టుగా మాత్రమే కాకుండా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. 2025లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ, ఇప్పుడు అదే జోష్‌తో రెండో టైటిల్ కోసం సిద్ధమైంది. గత సీజన్ విజేతగా నిలిచిన కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకుంటూనే, వేలంలో తెలివైన ఎంపికలతో జట్టును మరింత బలోపేతం చేసింది. ఈసారి ఆర్సీబీ గనుక కప్పు కొడితే, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.
జట్టు కూర్పు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ తన 19వ సీజన్‌ను అదే ఉత్సాహంతో ఆడేందుకు రెడీ అయిపోయాడు. రజత్ పాటిదార్ సారథ్యంలో టీమ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్, దేవ్ దత్ పడిక్కల్ వంటి స్టార్ బ్యాటర్లతో పాటు ఆల్ రౌండర్ల విభాగంలో కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్ ఉండటం టీమ్ కు పెద్ద ప్లస్. ముఖ్యంగా ఆర్సీబీకి ఎప్పుడూ శాపంగా మారే బౌలింగ్ విభాగంపై ఈసారి మేనేజ్మెంట్ గట్టిగా దృష్టి పెట్టింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి యార్కర్ స్పెషలిస్టులతో డెత్ ఓవర్ల కష్టాలకు చెక్ పెట్టాలని చూస్తోంది.
ఆర్సీబీ బలాల్లో ప్రధానంగా ఓపెనింగ్ జోడీని చెప్పుకోవాలి. కోహ్లీ నిలకడ, ఫిలిప్ సాల్ట్ మెరుపు వేగం పవర్‌ప్లేలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయం. అలాగే ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ ఉండటం జట్టుకు కొండంత అండ. అయితే, ప్రతికూల అంశాలను చూస్తే.. స్పిన్ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడం సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా చేతుల్లోనే ఉంది. ఒకవేళ హేజిల్‌వుడ్ లేదా భువనేశ్వర్ వంటి సీనియర్లు గాయపడితే బ్యాకప్ బౌలర్ల విషయంలో ఆర్సీబీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఈ సీజన్లో ఆర్సీబీ భవితవ్యం మొత్తం నలుగురు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో 8000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తే ఆర్సీబీని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. పవర్‌ప్లేలో ఫిలిప్ సాల్ట్ ఇచ్చే మెరుపు ఆరంభం, డెత్ ఓవర్లలో హేజిల్‌వుడ్ వేసే ఖచ్చితమైన యార్కర్లు జట్టుకు కీలకం. వీరితో పాటు ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఈ నలుగురు క్లిక్ అయితే ఆర్సీబీకి ఎదురుండదు.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఆర్సీబీ సులభంగా ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ (2019, 2020), సీఎస్కే (2010, 2011) మాత్రమే ఇప్పటివరకు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచాయి. ఇప్పుడు ఆర్సీబీకి ఆ అరుదైన క్లబ్‌లో చేరే సువర్ణావకాశం ఉంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో టీమ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటం, గత సీజన్ గెలిచిన ఆత్మవిశ్వాసం వారిని ఫేవరెట్లుగా నిలబెడుతోంది. ఈసాలా కప్ నమ్దే అన్న నినాదాన్ని ఈసారి కూడా కప్పు మనదే అనేలా మార్చడానికి ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..