IPL 2026 Eliminator: ఆరెంజ్ vs పింక్ హ్యాట్రిక్ పోరుకు వేళాయే.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
IPL Playoff Match Details: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ సమరం మొదలైన వేళ, అభిమానుల్లో అసలైన నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. మే 27న న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పని ఈ చావో రేవో పోరుకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం.

IPL 2026 Eliminator: ఇక తప్పులు చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఓడిపోతే లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్లడమే. ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పుడు ఎలిమినేటర్ పోరులో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్: ఎలిమినేటర్ సమరం ఎప్పుడు?
లీగ్ పట్టికలో మూడో స్థానంలో నిలిచిన పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానాన్ని దక్కించుకున్న రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్ మే 27, బుధవారం రాత్రి జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
మ్యాచ్ వేదిక, సమయం..
ఈ కీలక పోరుకు పంజాబ్ లోని సరికొత్త మైదానం వేదిక కానుంది.
వేదిక: మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్).
సమయం: బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 7:00 గంటలకు టాస్ వేస్తారు.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి? (టెలివిజన్, డిజిటల్)
ఈ రసవత్తర పోరును అభిమానులు ఎక్కడి నుంచైనా వీక్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
టీవీ ఛానళ్లు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (జియోస్టార్ నెట్‌వర్క్) ఛానళ్లలో వివిధ భాషల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మొబైల్, డిజిటల్ స్ట్రీమింగ్: మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో మ్యాచ్‌ను చూడాలనుకుంటే, ‘జియోహాట్‌స్టార్’ (JioHotstar) యాప్ లేదా వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.
ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!
ఇరు జట్ల బలాబలాలు.. పైచేయి ఎవరిది..?
ఈ సీజన్ లీగ్ దశలో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ జట్టు విజయం సాధించడంతో మానసికంగా సన్‌రైజర్స్ బలంగా ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైన్ అప్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఫామ్‌లోకి రావడం రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. అయితే, ముల్లన్‌పూర్ మైదానంలో రాజస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించడం విశేషం.
ముల్లన్‌పూర్ పిచ్ రిపోర్ట్.. బౌలర్లకు చుక్కలేనా..?
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వేదికైన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ముల్లన్‌పూర్) బ్యాటింగ్‌కు స్వర్గధామంగా పేరుగాంచింది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. చిన్న బౌండరీలు, వేగవంతమైన ఔట్‌ఫీల్డ్ కారణంగా బంతి క్షణాల్లో సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికే ఈ మైదానంలో 220కి పైగా భారీ స్కోర్లు కూడా ఎంతో సులువుగా ఛేజ్ అయ్యాయి. మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లకు కాస్త స్వింగ్ లభించినప్పటికీ, సమయం గడిచేకొద్దీ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని, రాత్రి వేళ చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డులు.. ఆరెంజ్ ఆర్మీదే పైచేయి..!
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా, అందులో సన్‌రైజర్స్ ఏకంగా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. అంతేకాదు, ఈ 2026 సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు రాజస్థాన్‌ను చిత్తు చేయడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో, జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించి మానసికంగా బలంగా ఉంది.
ఇరు జట్ల బలాబలాలు.. కీలక ఆటగాళ్లు వీరే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లతో పాటు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ రూపంలో విధ్వంసకర బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. ముఖ్యంగా క్లాసెన్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో ఇషాన్ మలింగ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు 15 ఏళ్ల సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై భారీగా ఆశలు పెట్టుకుంది. జైపూర్‌లో హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదిన సూర్యవంశీ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. అతనికి తోడుగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ లతో రాజస్థాన్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ పవర్‌ప్లేలో వికెట్లు తీయడంపైనే రాజస్థాన్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రెండు జట్ల అంచనా తుది జట్లు (ప్లేయింగ్ 11):
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, జీషన్ అన్సారీ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్, యష్ రాజ్ పుంజా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు, రాజస్థాన్ రాయల్స్ వ్యూహాత్మక ఆటతీరుకు మధ్య జరగబోయే ఈ పోరు క్రికెట్ ప్రేమికులకు కంటిమీద కునుకు లేకుండా చేయడం ఖాయం. పంజాబ్ పిచ్‌పై మొదట్లో పేసర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మరి రేపు హైదరాబాద్ కేక పెడుతుందో, రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




