Team India: అక్కడే ఉంటే, ఆడేది ఎప్పుడు.. బీసీసీఐపై మాజీ ప్లేయర్ ఫైర్..!
భారత క్రికెటర్ల గాయాల నిర్వహణపై చర్చ మళ్లీ మొదలైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై ప్రశ్నలు వస్తున్న వేళ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల గాయాల విషయంలో జవాబుదారీతనం అవసరమని చెప్పిన అతడు, జాతీయ జట్టు ఎంపిక వ్యవస్థలోనూ మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాడు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై చర్చ కొనసాగుతోంది. ప్రముఖ భారత క్రికెటర్ల గాయాలు ఎక్కువ కాలం కొనసాగుతున్న నేపథ్యంలో బెంగళూరు కేంద్రం పనితీరుపై పలు నివేదికలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ వ్యవహారంపై మాజీ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా స్పందించాడు. ఆటగాళ్ల గాయాల నిర్వహణ విషయంలో జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లకు ప్రత్యేక జట్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపాడు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు వేర్వేరు ఫార్మాట్లలో కొనసాగడం మంచిదేనని సూచించాడు.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్, వైద్య విభాగాలకు జాతీయ పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి మధ్య సమాచార మార్పిడిలో లోపాలు ఉన్నాయనే అంశం తాజాగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో ఆగస్టు 15న ప్రారంభమైన టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడని మొదట సెలెక్టర్లకు సమాచారం ఉన్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. తరువాత అతడి గాయం తీవ్రత అంచనాల కంటే ఎక్కువగా ఉందని తెలిసింది.
ఈ పరిస్థితిపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. గాయాల నిర్వహణ విషయంలో బాధ్యత ఎవరిది అన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
తన వ్యాఖ్యలకు ఉదాహరణగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అతడు మూడు, నాలుగు నెలల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద ఉన్నాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఆడేందుకు అనుమతి కోరినప్పటికీ విడుదల చేయలేదని తెలిపాడు. నెల రోజుల్లో తిరిగి రావాల్సిన ఆటగాడు రెండు, మూడు నెలలు అక్కడే ఉన్నాడని వివరించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
