3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి.. లేదంటే గంభీర్ పరువు అడ్డంగా పోయినట్టే: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
India vs New Zealand 3rd ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇందౌర్‌లో జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. గత రెండు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ గట్టిగా డిమాండ్ చేశాడు.

Ravichandran Ashwin: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ నిర్ణయాత్మక పోరుకు సమయం ఆసన్నమైంది. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో భారత్ గెలవగా, రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మార్చింది. అయితే, ఈ సిరీస్‌లో టీమ్ సెలక్షన్, ముఖ్యంగా బౌలర్ల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ తన గళాన్ని విప్పాడు.
అర్ష్‌దీప్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?
అశ్విన్ తన విశ్లేషణలో అర్ష్‌దీప్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “అర్ష్‌దీప్ సింగ్ జట్టు కోసం ఎంతో చేశాడు. కానీ ఇప్పటికీ అతను తుది జట్టులో తన స్థానం కోసం పోరాడాల్సి రావడం విచారకరం. బంతిని చేతికి ఇచ్చిన ప్రతిసారీ అతను అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. మరి అతడిని మొదటి రెండు వన్డేల నుంచి ఎందుకు తప్పించారు? ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయదా?” అని అశ్విన్ ప్రశ్నించాడు.
బౌలర్లకే ఈ పరిస్థితా?
జట్టులో బ్యాటర్లకు ఇచ్చే ప్రాధాన్యత బౌలర్లకు ఇవ్వడం లేదని అశ్విన్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. “ఇలాంటి పరిస్థితులు కేవలం బౌలర్ల విషయంలోనే జరుగుతాయి, బ్యాటర్ల విషయంలో కాదు” అంటూ తన వాదనను గట్టిగా వినిపించాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమే అయినప్పటికీ, న్యూజిలాండ్ వంటి జట్లపై అర్ష్‌దీప్ వంటి స్వింగ్ బౌలర్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
దక్షిణాఫ్రికా టూర్ vs న్యూజిలాండ్ సిరీస్..
దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఆడేటప్పుడు ‘హిట్ ది డెక్’ (Hit the deck) బౌలర్లు అవసరమని, కానీ భారత పిచ్‌లపై న్యూజిలాండ్‌తో ఆడేటప్పుడు ఆ ఫార్ములా ఎప్పుడూ వర్కవుట్ కాదని అశ్విన్ హెచ్చరించాడు. అందుకే మూడో వన్డేలో అర్ష్‌దీప్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అశ్విన్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా పాత జట్టుతోనే బరిలోకి దిగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందున, బౌలింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
