Ranji Trophy 2024: ‘రంజీ రారాజు’గా ముంబై.. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ కైవసం

ముంబై జట్టు మరోసారి అదరగొట్టింది. రంజీ రారాజుగా పేరున్న ఆ జట్టు మరోసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై ముంబై 169 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఈ టైటిల్‌తో ముంబై రికార్డ్ స్థాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది

Ranji Trophy 2024: రంజీ రారాజుగా  ముంబై.. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ కైవసం
Ranji Trophy 2024

Updated on: Mar 14, 2024 | 2:58 PM

ముంబై జట్టు మరోసారి అదరగొట్టింది. రంజీ రారాజుగా పేరున్న ఆ జట్టు మరోసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై ముంబై 169 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఈ టైటిల్‌తో ముంబై రికార్డ్ స్థాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ జట్టు కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై తరఫున శామ్స్ ములానీ, తనుష్ కొట్యాన్, ధవల్ కులకర్ణి తలో 3 వికెట్లతో మెరిశారు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై తరఫున యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ (136) సెంచరీ చేయగా, శ్రేయాస్ అయ్యర్ 95 పరుగులు చేశాడు. షమ్స్ ములానీ కూడా 50 పరుగులతో మెరిశాడు. ఈ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ లో 538 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టుకు ఈసారి కరుణ్ నాయర్ ఆసరాగా నిలిచాడు. 74 పరుగులు చేయడం ద్వారా, కరుణ్ నాలుగో రోజు ఆటలో విదర్భ జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటించాడు. ఆ తర్వాత అక్షయ్ వాడ్కర్ (102), హర్ష్ దూబే (65) రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.అయితే వారిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో ముంబై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు బిగించారు. విదర్భ జట్టును 368 పరుగులకు ఆలౌట్ చేశారు.దీంతో ముంబై జట్టు 169 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దేశవాళీ క్రికెట్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42వ సారి గెల్చుకున్న ప్రత్యేక ఫీట్‌ను కూడా నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

ముంబై విజయ దరహాసం.. వీడియో

బీసీసీఐ అభినందనలు..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..